Jagan: నేడు శ్రీకాకుళం జిల్లాకు సీఎం జగన్.. భారీ భద్రత ఏర్పాటు
- జిల్లాలో ఇటీవల మావోయిస్టు డంప్ లభ్యం
- సీఎం అయ్యాక తొలిసారి శ్రీకాకుళం జిల్లా పర్యటనకు
- వందలాదిమంది పోలీసులతో భారీ భద్రత
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత జిల్లాకు రావడం ఇదే తొలిసారి. జిల్లాలో ఇటీవల మావోయిస్టు డంప్ లభ్యం కావడంతో పాటు వాళ్ల కదలికలు గుర్తించడంతో జగన్‌కు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రికి జడ్‌ప్లస్ భద్రత ఉండగా, శ్రీకాకుళం, విజయనగరం ఎస్పీల ఆధ్వర్యంలో భద్రతను పర్యవేక్షించనున్నారు.
దీంతోపాటు ఇద్దరు అదనపు ఎస్పీలు, 14 మంది డీఎస్పీలు, 45 మంది సర్కిల్ ఇన్స్పెక్టర్లు, 118 మంది సబ్ఇన్స్పెక్టర్లు, 215 మంది ఏఎస్ఐ/హెడ్‌కానిస్టేబుళ్లు, 686 మంది పోలీస్ కానిస్టేబుళ్లు, 85 మంది మహిళా పోలీసులు, 350 మంది హోంగార్డులు, 266 మందితో కూడిన స్పెషల్ టాస్క్‌ఫోర్స్ బృందంతో ప్రత్యేక భద్రత చేపట్టనున్నారు.