New Delhi: మద్యం తాగి దొరికిన బైకర్.. జరిమానా కట్టమంటే బైక్‌ను తగలబెట్టిన వైనం!

  • ద్విచక్ర వాహనదారుడికి భారీ జరిమానా
  • చెల్లించలేకపోవడంతో బైక్ స్వాధీనం
  • పెట్రోలు పైపు లీక్ చేసి తగలబెట్టిన బైకర్

కొత్త ట్రాఫిక్ రూల్స్ వాహనదారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. వేలాది రూపాయలను జరిమానాలుగా వసూలు చేస్తుండడంతో దిక్కుతోచని స్థితికి చేరుకుంటున్నారు. తాజాగా, గురువారం ఓ వ్యక్తి జరిమానా చెల్లించలేక తన ద్విచక్ర వాహనాన్ని అందరి ముందు తగలబెట్టేశాడు. ఢిల్లీలోని షేక్ సరాయి ఫేజ్-1లో ఈ  ఘటన చోటుచేసుకుంది.

రాకేశ్ అనే యువకుడు మద్యం తాగి బైక్‌పై వెళ్తూ దొరికిపోయాడు. బ్రీత్ అనలైజర్ టెస్టులో ఆల్కహాల్ శాతం 200 పాయింట్లు దాటింది. మద్యం తాగి బైక్ నడపడం ఓ నేరం అయితే, బైక్‌కు సంబంధించిన ఎటువంటి పత్రాలు అతడి వద్ద లేకపోవడం మరో తప్పు. దీంతో అతడికి పోలీసులు భారీ జరిమానా వడ్డించారు. జరిమానా చెల్లించేందుకు డబ్బులు లేవని చెప్పడంతో అతడి నుంచి పోలీసులు బైక్‌ను స్వాధీనం చేసుకుని పక్కన పార్క్ చేశారు.

అయితే, బైక్‌లో విలువైన పత్రాలు ఉన్నాయని, వాటిని తీసుకుంటానని పోలీసులకు చెప్పి బైక్ వద్దకు వెళ్లిన రాకేశ్ పెట్రోలు పైపును లీక్ చేసి నిప్పు పెట్టాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు మంటలు అదుపు చేసి రాకేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News