Loans: ఇకపై 59 నిమిషాల్లోనే రిటైల్ రుణాలు... అందుబాటులోకి ప్రభుత్వ బ్యాంకుల కొత్త సేవ!
- ఇప్పటివరకూ ఎంఎస్ఎంఈలకే సేవలు
- పత్రాలన్నీ సక్రమంగా ఉంటే కోటి వరకూ రుణం
- ఇకపై రిటైల్ రంగంలో గృహ, వ్యక్తిగత రుణాలు కూడా
ఇప్పటివరకూ కేవలం ఎంఎస్ఎంఈ (మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ ప్రైజస్)కు మాత్రమే అందుబాటులో ఉన్న పీఎస్యూ బ్యాంకుల ఆన్ లైన్ రుణాల సేవలను ఇకపై రిటైల్ రంగానికీ విస్తరిస్తున్నారు. ఇందులో భాగంగా కేవలం 59 నిమిషాల వ్యవధిలో రుణం మంజూరవుతుంది. అన్ని పత్రాలూ సక్రమంగా ఉంటే చాలు. ఇకపై గృహ, వ్యక్తిగత రుణ ప్రతిపాదనలకూ ఈ పోర్టల్ ను వాడుకోవచ్చని, త్వరలోనే వాహన రుణాలకూ విస్తరిస్తామని అధికార వర్గాలు వెల్లడించాయి.
నవంబర్ 2018లో కేంద్రం ఈ పథకాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇంతవరకూ ఎంఎస్ఎంఈలకు కోటి రూపాయల వరకూ రుణం గంట వ్యవధిలోనే మంజూరవుతుంది. ఆదాయపు పన్ను దాఖలు, బ్యాంకు ఖాతాల ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్లను పరిగణనలోకి తీసుకుని, వాటి నుంచి వచ్చే సమాచారం ద్వారా తక్షణ రుణ లభ్యత కల్పించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఈ సంవత్సరం మార్చి 31వ తేదీ వరకూ, మొత్తం 50,706 ప్రతిపాదనలు రాగా, 27,893 ప్రతిపాదనలకు ఆమోదముద్ర పడిందని అధికారులు వెల్లడించారు.