Karnataka: అసెంబ్లీలో పోర్న్ వీడియోలు చూడటం జాతి వ్యతిరేకమేమీ కాదన్న కర్ణాటక న్యాయ మంత్రి!
- 2012లో అశ్లీల దృశ్యాలు చూస్తూ కెమెరాకు చిక్కిన లక్ష్మణ్ సావడి
- ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు
- వెనకేసుకొచ్చిన న్యాయ మంత్రి మధుస్వామి
విధాన సభలో కూర్చుని అశ్లీల వీడియోలను చూడటమేమీ జాతి వ్యతిరేక చర్య కాదని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ్ సావడిని వెనకేసుకు వచ్చారు ఆ రాష్ట్ర న్యాయ శాఖా మంత్రి జేసీ మధుస్వామి. 2012లో ఆయన అసెంబ్లీలో తన స్మార్ట్ ఫోన్ లో పోర్న్ వీడియోలు చూస్తూ కెమెరాకు చిక్కి, ఆపై తీవ్ర విమర్శలతో తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
ఇటీవలి కర్ణాటక రాజకీయ పరిణామాల తరువాత, బీజేపీ అధికారంలోకి రాగా, లక్ష్మణ్ సావడి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యారు. ఇక తాజాగా తుముకూరులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రి మధుస్వామి వచ్చిన వేళ, లక్ష్మణ్ ఉదంతం ప్రస్తావనకు వచ్చింది. "అది ఆయన తప్పే. అయితే, అదేమీ జాతి వ్యతిరేక కార్యకలాపం కాదు. ఆ కారణంగా ఆయన మంత్రి పదవికి అనర్హుడని అనలేం" అన్నారు. ఆయన అనుకోకుండా సెల్ ఫోన్ ఓపెన్ చేయగా, ఆ వీడియో వచ్చిందే తప్ప, ఆయన తప్పేమీ లేదని వ్యాఖ్యానించారు.