Ashes: యాషెస్ సిరీస్ ను స్టేడియంలో కూర్చుని చూసేందుకు నాలుగేళ్లు శ్రమించిన బాలుడు!
- చెత్తను సేకరించి డబ్బులు సంపాదించిన 12 ఏళ్ల బాలుడు
- తండ్రితో కలిసి యాషెస్ ను వీక్షిస్తున్న మ్యాక్స్ వెయిట్
- బాలుడి ఇంటర్వ్యూలు తీసుకున్న కామెంటేటర్లు
క్రికెట్ ప్రపంచంలో యాషెస్ సిరీస్ కు ఉండే ప్రత్యేకతే వేరు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగే ఈ టెస్టు సమరానికి ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు. యాషెస్ మ్యాచ్ లు చూడడం అనేది ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ప్రజల జీవితంలో ఓ భాగం అన్నంతగా భావోద్వేగాలు పెనవేసుకుని పోయాయి. మ్యాక్స్ వెయిట్ అనే 12 ఏళ్ల బాలుడు కూడా యాషెస్ చూసేందుకు ఎంతగా శ్రమించాడో తెలిస్తే ఆ సిరీస్ కు ఉన్న విలువేంటో అర్థమవుతోంది.
వెయిట్ ఆస్ట్రేలియాకు చెందినవాడు. యాషెస్ సిరీస్ లో కనీసం ఒక్క మ్యాచ్ అయినా స్టేడియంలో కూర్చుని చూడాలన్నది ఆ కుర్రాడి కోరిక. తండ్రికి చెబితే కనీసం రూ.1500 డాలర్లు సంపాదించి చూపించు, యాషెస్ కు తీసుకెళతాను అని చెప్పాడు.
అప్పటినుంచి వీకెండ్ లో తన ఇరుగుపొరుగు ఇళ్ల నుంచి చెత్త సేకరించి డంపింగ్ యార్డులో పారవేసి వచ్చేవాడు. అందుకోసం ఒక డాలరు ఫీజు తీసుకునేవాడు. ఆ విధంగా నాలుగేళ్లలో తండ్రి చెప్పిన మొత్తం సంపాదించి చూపించాడు. దాంతో మురిసిపోయిన వెయిట్ తండ్రి తన మాట నిలబెట్టుకున్నాడు. సీన్ కట్ చేస్తే... ప్రస్తుతం ఆ ఆస్ట్రేలియా బాలుడు తన తండ్రితో కలిసి ఇంగ్లాండ్ లో జరుగుతున్న యాషెస్ సిరీస్ ను ప్రత్యక్షంగా వీక్షిస్తున్నాడు. కామెంటేటర్లు సైతం వెయిట్ కథ తెలుసుకుని అతడితో ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు తీసుకున్నారు. అంతేకాదు, ఆసీస్ క్రికెటర్లు తమ దేశ కుర్రాడికి జెర్సీలను కూడా బహుమతిగా ఇచ్చారు.