ISRO: గమ్యం ముంగిట తడబాటు.. చివరి క్షణంలో విక్రమ్ నుంచి ఆగిన సంకేతాలు
- చివరి 15 నిమిషాల్లో 14 నిమిషాలు విజయవంతం
- చంద్రుడికి మరో 2.1 కిలోమీటర్ల దూరంలో ఉండగా నిలిచిపోయిన సంకేతాలు
- ఇస్ట్రాక్లో ఒక్కసారిగా అలముకున్న నిశ్శబ్దం
ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూసిన చంద్రయాన్-2 చివరి దశలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఫలితంగా విక్రమ్ ల్యాండర్ నుంచి సంకేతాలు ఆగిపోయాయి. మరో నిమిషంలో చంద్రుడిపై దిగుతుందనగా అకస్మాత్తుగా సిగ్నల్స్ ఆగిపోవడంతో శాస్త్రవేత్తలు నిరాశలో మునిగిపోయారు. చివరి 15 నిమిషాల్లో 14 నిమిషాలు విజయవంతంగా పూర్తయ్యాయి. దీంతో శాస్త్రవేత్తల్లో ఆనందం వెల్లివిరిసింది. అయితే, ‘విక్రమ్’ మరో నిమిషంలో జాబిల్లిని ముద్దాడుతుందనగా సంకేతాలు ఆగిపోయాయి.
అర్ధరాత్రి దాటాక 1:38 గంటలకు ల్యాండింగ్ ప్రక్రియ మొదలైంది. గంటకు 6 వేల కిలోమీటర్ల వేగంతో చంద్రుడిపైకి దూసుకొస్తున్న విక్రమ్ ల్యాండర్ వేగాన్ని తొలుత విజయవంతంగా తగ్గించగలిగారు. ‘రఫ్ బ్రేకింగ్’ దశ విజయవంతమైంది. పది నిమిషాల తర్వాత ‘ఫైన్ బ్రేకింగ్’ దశ కూడా విజయవంతమైంది. జాబిల్లికి విక్రమ్ ల్యాండర్‌కు మధ్య గల దూరం 2.1 కిలోమీటర్లు ఉందనగా సమస్య మొదలైంది. ‘విక్రమ్’ నుంచి సంకేతాలు ఆగిపోయాయి. దీంతో బెంగళూరులోని ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ (ఇస్ట్రాక్)లో ఒక్కసారిగా నిశ్శబ్దం చోటు చేసుకుంది. సంకేతాల కోసం కాసేపు వేచి చూసినా ఫలితం లేకపోవడంతో ల్యాండర్ నుంచి సంకేతాలు ఆగిపోయాయని, సంబంధిత డేటాను విశ్లేషిస్తున్నామని ఇస్రో చైర్మన్ కె.శివన్ ఓ ప్రకటన విడుదల చేశారు.