Srisailam: శ్రీశైలం డ్యామ్ కు పోటెత్తుతున్న వరద
- ఎగువన కురుస్తున్న వర్షాలతో భారీగా చేరుతున్న వరద నీరు
- సుంకేశుల, జూరాల నుంచి వచ్చిన 2.35 లక్షల క్యూసెక్కుల నీరు
- ఈ సాయంత్రం లేదా రేపు ఉదయం గేట్లు ఎత్తేసే అవకాశం
ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణా నది పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం డ్యామ్ కు వరద నీరు పోటెత్తుతోంది. జలాశయానికి భారీగా వరద చేరుతోంది. సుంకేశుల, జూరాల ప్రాజెక్టుల నుంచి 2.35 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. ప్రస్తుతం డ్యామ్ లో నీటిమట్టం 878 అడుగులకు చేరింది. 181 టీఎంసీల నీరు నిలువ ఉంది. వరద ఉద్ధృతి ఇలాగే కొనసాగితే ఈ సాయంత్రానికి గానీ లేదా రేపు ఉదయానికి గాని ప్రాజెక్టు గేట్లు ఎత్తేసే అవకాశం ఉంది. మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హంద్రీనీవాకు 2 వేల క్యూసెక్కులు, కల్వకుర్తికి 2,400 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడుకు 24,500 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు కుడిగట్టు, ఎడమగట్టు విద్యుదుత్పత్తి కేంద్రాల నుంచి నాగార్జునసాగర్ కు 43 వేల క్యూసెక్కుల నీరు వెళ్తోంది.