Andhra Pradesh: తుగ్లక్ 2.0@100 రోజులు.. ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై నారా లోకేశ్ సెటైర్లు!
- తుగ్లక్ పాలనలో ధర్నాచౌక్ ఫుల్ అయిపోయింది
- అభివృద్ధి సంక్షేమం నిల్ అయిపోయాయి
- కార్మికులకు తిండి, పని లేకుండా ఈ-కేవైసీ కోసం నిలబెట్టారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ 100 రోజులు పూర్తి చేసుకున్న వేళ టీడీపీ నేత నారా లోకేశ్ ఏపీ సీఎంపై ఘాటు విమర్శలు చేశారు. తుగ్లక్ 2.0 వంద రోజుల పాలనలో ధర్నాచౌక్ ఫుల్ అయిపోతే, అభివద్ధి, సంక్షేమం నిల్ అయిపోయిందని ఎద్దేవా చేశారు. ఆంధ్రుల రాజధాని అమరావతిని ఎడారి చేసేశారనీ, పోలవరాన్ని మంగళవారంగా మార్చేశారని దుయ్యబట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన 900 హామీలను నవరత్నాలంటూ 9 హామీలకు కుదించారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఇదంతా చేసి ఏమైనా సాధించారా? అంటే అదీ లేదని వ్యాఖ్యానించారు. ఉద్యోగులను రోడ్లపైకి ఈడ్చిపడేసిన ముఖ్యమంత్రి, తన నివాసం దగ్గర 144 సెక్షన్ పెట్టుకున్నారని లోకేశ్ విమర్శించారు. కార్మికులకు పని, తిండి లేకుండా చేసి ఈ-కేవైసీ లైన్లలో నిలబెట్టారని దుయ్యబట్టారు. ఈ మాత్రం దానికే 100 రోజుల పండుగ అంటూ సొంత డబ్బా కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. దీనివల్ల ప్రజల సొమ్ము దండగ కావడం తప్ప ప్రయోజనమేదీ ఉండదని స్పష్టం చేశారు. ఈ మేరకు లోకేశ్ వరుస ట్వీట్లు చేశారు.