Andhra Pradesh: అవును.. నిజమే, నీ అవినీతి వృద్ధిని తగ్గించాం!: చంద్రబాబుకి బొత్స కౌంటర్
- ఏపీలో చంద్రబాబు అవినీతివృద్ధిని దిగజార్చాం
- కడుపు మంటతో చంద్రబాబు గగ్గోలు పెడుతున్నారు
- టీడీపీ నేతలు ఇంకా అధికారమదంతో వ్యవహరిస్తున్నారు
- తాడేపల్లిలో మీడియాతో ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి
తెలుగుదేశం మద్దతుదారులు బాధితుల శిబిరాలకు వెళుతున్నారనీ, వాళ్లను ఊర్లు ఖాళీ చేసి వెళ్లాలని ఎవరు బెదిరించారని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. అసలు టీడీపీ వాళ్లను ఊర్ల నుంచి బహిష్కరించినట్లు మీడియాలో ఎక్కడైనా వార్తలు వచ్చాయా? అని అడిగారు. చంద్రబాబు పెయిడ్ ఆర్టిస్టులు, పెయిడ్ వర్కర్లను పెట్టుకుని ఓ.. అంటూ గగ్గోలు పెడుతున్నారని విమర్శించారు. ఆయన ఎన్ని గిమ్మిక్కులు చేసినా, తాము మాత్రం ప్రభుత్వ విధానాలు, పద్ధతుల ప్రకారమే ముందుకు పోతామని స్పష్టం చేశారు. ఆవేశం, ఆక్రోశం, కడపుమంటతోనే చంద్రబాబు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని బొత్స ఎద్దేవా చేశారు. తాడేపల్లిలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు.
చంద్రబాబు లాబీ, ఊబిలో పడి తాము దారి తప్పబోమని బొత్స స్పష్టం చేశారు. ఇప్పటివరకూ ప్రధానిని జగన్ 3-4 సార్లు కలిశారనీ, కలిసిన ప్రతీసారీ రాష్ట్రానికి ప్రత్యేకహోదా గురించి అడుగుతూనే ఉన్నారని గుర్తుచేశారు. కానీ చంద్రబాబు ప్రధానికి ఇచ్చిన లేఖలో అసలు హోదా ప్రస్తావనే లేదని విమర్శించారు. ‘వృద్ధిని దిగజార్చిన ఘనత జగన్ దే అని చంద్రబాబు అంటున్నారు. ఎస్.. అవును. నీవు (చంద్రబాబు) చేసిన అవినీతి వృద్ధిని తగ్గించాం. అలాంటి అవినీతి లేకుండా ఈ 100 రోజులు పరిపాలించాం. కాదంటావా? ఈ 100 రోజుల్లో ఏమైనా ఆరోపణలు వచ్చాయా? ఎంతసేపు నీ డబ్బా, నీ సొల్లు తప్పించి అవినీతి ఆరోపణలు వచ్చాయా? కోడెల శివప్రసాద్ తప్పుచేశాడా? లేదా? ఆయన చర్యల వల్ల రాజకీయ వ్యవస్థ తాలూకూ పరువు తీశాడా లేదా?
రాజకీయ నాయకుడు అంటేనే చీదరించుకునే పరిస్థితి తీసుకొచ్చాడా లేదా? అని రాష్ట్ర ప్రజలను నేను అడుగుతున్నా. చింతమనేనిపై ప్రభుత్వం కేసులు పెడుతోందా? శ్రీకాకుళంలో కూన రవి దూషించడాన్ని రాష్ట్రమంతా చూసింది కదా. ఇదేమన్నా వక్రీకరించామా?’ అని నిలదీశారు. రాజధానిలో స్థానిక ఎమ్మెల్యే పోతే కుల వివక్షతో మాట్లాడారనీ, టీడీపీ నేతలకు ఎంత అహంకారమని ప్రశ్నించారు. ఇంతకుముందు అధికారం ఉన్నప్పుడు టీడీపీ ఇష్టానుసారం వ్యవహరించేవారని విమర్శించారు. ఇంకా టీడీపీ నేతలు అదే అధికార మదంతో వెళ్లాలని అనుకుంటున్నారని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యంలో చట్టాలు తమ పనిని తాము చేసుకుపోతాయని స్పష్టం చేశారు.