Andhra Pradesh: చంద్రబాబు సర్కారు రాజధాని అమరావతిపై అసలు గెజిట్ నోటిఫికేషనే ఇవ్వలేదు!: మంత్రి బొత్స సంచలన ప్రకటన
- రాజధానిని బాబు తాత్కాలికం చేశాడు
- ఐదేళ్లు అధికారమిస్తే ఎంజాయ్ చేశాడు
- రాష్ట్ర ఖజానాను దోచేశాడు
- తాడేపల్లిలో మీడియాతో ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి స్పందించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే అని చంద్రబాబు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిందా? అని బొత్స ప్రశ్నించారు. ఈ విషయంలో చంద్రబాబు స్పందించాలని బొత్స డిమాండ్ చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చినట్లు మీడియా మిత్రులు కూడా చూడలేదన్నారు. అర్ధరాత్రి పారిపోయి రాష్ట్రానికి వచ్చి అడ్రస్ లేకుండా చేసిన చంద్రబాబు కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. తాడేపల్లిలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడారు.
‘అన్నిటినీ తాత్కాలికం అని చెప్పి ఇన్నేళ్లు చంద్రబాబు ఎలా అయితే బతికాడో, అమరావతిని కూడా అదే రీతిలో తాత్కాలికంగా ఉంచాడు. అంతేకానీ రాజధాని అభివృద్ధి ఎక్కడ జరిగింది? ఒకవేళ జరిగినట్లు చంద్రబాబు చెబితే నేను కరెక్ట్ చేసుకుంటాను. అసలు రాజధానిపై గెజిటే విడుదల చేయకుండా అసలు నీకు(చంద్రబాబుకు) మాట్లాడే హక్కు ఉందా? ప్రజలు ఐదేళ్లు పాలించమని తీర్పు ఇస్తే ఎంజాయ్ చేశావ్. రాష్ట్ర ఖజానాను కొల్లగొట్టావ్. చంద్రబాబే చెప్పాడు కదా.. కట్టిన బిల్డింగులు తాత్కాలికమని. ఏ ముఖం పెట్టుకుని ఏం పుస్తకం రిలీజ్ చేస్తాడు? చిన్నవయసులోనే వైఎస్ స్ఫూర్తితో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రజారంజక పరిపాలన అందిస్తుంటే, నువ్వా(చంద్రబాబు) విమర్శించేది?
మీరా మాకు నీతులు చెప్పేది? పెట్టుబడిదారులు వెళ్లిపోతున్నారంట. ఎక్కడికి పోతారండీ పెట్టుబడిదారులు. నీలాంటి వాడి పాలన ఉంది కాబట్టే ఇన్నాళ్లూ పెట్టుబడిదారులు రాష్ట్రాన్ని వదిలి పారిపోయారు. ఎవరూ పర్మినెంట్ గా ఈ రాష్ట్రానికి రాలేదు. అందుకే ఇవాళ మీడియా ద్వారా గత 100 రోజుల్లో జరిగిన పరిపాలనను వివరిస్తున్నాం. జగన్ మా అన్న, తమ్ముడు, కుటుంబ సభ్యుడు అని ప్రతీ పేదవాడు అనుకునేలా మేం పరిపాలన అందిస్తాం’ అని బొత్స సత్యనారాయణ తెలిపారు.