Jagan: ఏపీ ప్రభుత్వంపై స్వామి కమలానంద భారతి ఆగ్రహం
- కేవలం రెండు మతాలను తృప్తి పరిచేలా పని చేస్తోంది
- క్రైస్తవ మతాన్ని పరిచయం చేసే కుట్ర దాగుంది
- హిందూ ఆలయాల్లో అన్య మతస్థులను తొలగించాలి
ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై హిందూ దేవాలయ ప్రతిష్టాన్ పీఠం అధిపతి స్వామి కమలానంద భారతి మండిపడ్డారు. కేవలం రెండు మతాలను తృప్తి పరిచేలా ప్రభుత్వం పని చేస్తోందని విమర్శించారు. అన్ని మతాలను సమానంగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు. పాస్టర్లకు, మసీదుల్లో పని చేసేవారికి జీతాలు ఇవ్వాలనుకున్నప్పుడు... దేవాదాయశాఖ మాదిరి ఓ శాఖను ఏర్పాటు చేసి, దాని ద్వారా జీతాలు ఇవ్వాలని సూచించారు. గ్రామ వాలంటీర్ వ్యవస్థ ద్వారా క్రైస్తవ మతాన్ని పరిచయం చేసే కుట్ర దాగుందని చెప్పారు.
హిందూ దేవాలయాల్లో ఇతర మతస్థులు పని చేయడం సరికాదని కమలానంద భారతి చెప్పారు. అన్యమతస్థులను వెంటనే గుర్తించి, వారిని తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ఇతర మతస్థులు కోర్టుకు వెళ్లినా చెల్లదని చెప్పారు. టీటీడీ బోర్డు సభ్యులను పెంచడం కూడా అనవసరమని... ఖర్చులు పెరగడం మినహా మరే ప్రయోజనం లేదని అన్నారు. రాజకీయ నిరుద్యోగాన్ని తొలగించడానికే టీటీడీ సభ్యుల సంఖ్యను పెంచుతున్నారని మండిపడ్డారు. ఆలయ ధర్మకర్తగా బాధ్యతలు తీసుకునేవారికి ఆధ్యాత్మిక క్రమశిక్షణ ఉండాలని చెప్పారు.