Andhra Pradesh: పవన్ కల్యాణ్ ఇప్పటికైనా సినిమా ప్రపంచం నుంచి బయటకు రావాలి!: మంత్రి బొత్స విసుర్లు
- చంద్రబాబు భయంతోనే గగ్గోలు పెడుతున్నారు
- రాజధాని భూములిచ్చిన రైతులకు ఇబ్బంది లేదు
- అమరావతిలో రాజధాని వద్దన్న పవన్ ఇప్పుడు కావాలంటున్నారు
ఆంధ్రప్రదేశ్ లో అవినీతిని అరికట్టడానికి తమ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ ప్రక్రియను చేపట్టిందని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. అయితే తాను తీసుకున్న మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని కాంట్రాక్టర్లు అడుగుతారన్న భయంతోనే చంద్రబాబు రివర్స్ టెండరింగ్ పై గగ్గోలు పెడుతున్నారని విమర్శించారు. ఈ విషయంలో మరింత స్పష్టత కావాలంటే చంద్రబాబు ఇంటికి వెళ్లి అడగాలని మీడియాకు సూచించారు. చంద్రబాబు 40 సంవత్సరాల ఇండస్ట్రీ అయితే తాను 30 సంవత్పరాల ఇండస్ట్రీ అనీ, ఆయన కంటే పదేళ్లు తక్కువేనని వ్యాఖ్యానించారు. తాడేపల్లిలో ఈరోజు మీడియాతో మాట్లాడిన మంత్రి బొత్స సత్యనారాయణ టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
కేబినెట్ లో ఓ నిర్ణయం తీసుకున్నాక, చట్టం చేసేశాక కూడా రాజధానిపై గెజిట్ నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేదని బొత్స మళ్లీ చంద్రబాబును ప్రశ్నించారు. అమరావతిలో భూములు ఇచ్చిన రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదని హామీ ఇచ్చారు. టీడీపీ సర్కారు రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేస్తామన్నారు. చంద్రబాబు రాజధానికి ఓ అడ్రస్ అంటూ లేకుండా చేశారని దుయ్యబట్టారు.
ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై బొత్స ఘాటు విమర్శలు చేశారు. పవన్ కల్యాణ్ ఇప్పటికైనా సినిమా ప్రపంచం నుంచి బయటకు రావాలని బొత్స హితవు పలికారు. ‘అమరావతి ప్రాంతంలో రాజధాని వద్దని పవన్ కల్యాణ్ గతంలో చెప్పారు. ఇప్పుడు మళ్లీ అదే ప్రాంతంలో రాజధాని ఉండాలని అంటున్నారు’ అంటూ చురక అంటించారు.