Hyderabad: బావ ఇంటిని అతడికి తెలియకుండా తాకట్టు పెట్టేసిన రౌడీషీటర్ అరెస్ట్
- దుబాయ్‌లో ఉంటున్న బావ
- అతడి ఇంటి వ్యవహారాలను చూసుకుంటున్న బావమరిది
- అద్దెకు ఉంటున్న వారి నుంచి రూ. 30 లక్షలు వసూలు
బావ ఇంటిని అతడికి తెలియకుండా తాకట్టు పెట్టి ఏకంగా రూ.30 లక్షలు వాడుకున్న రౌడీషీటర్‌కు మీర్‌చౌక్ పోలీసులు అరదండాలు వేశారు. పోలీసుల కథనం ప్రకారం.. పురానాహవేలీకి చెందిన కైసరుద్దీన్ కుటుంబ సమేతంగా దుబాయ్‌లో ఉంటున్నాడు. పురానీహవేలిలో అతడికి ఐదంతస్తుల భవనం ఉంది. ఆ ఇంటి అద్దె వ్యవహారాలను కైసరుద్దీన్ సొంత బావమరిది ఇమ్రాన్ చూసుకునేవాడు. ఇంటి అద్దెలను వసూలు చేసి ప్రతినెల బావ ఖాతాలో జమచేసేవాడు.
ఇటీవల ఇమ్రాన్‌కు డబ్బు అవసరం ఉండడంతో తాకట్టు పెట్టుకుని డబ్బులు ఇవ్వాలంటూ అద్దెకు ఉంటున్న వారి నుంచి రూ.30 లక్షల వసూలు చేసి వాడుకున్నాడు. మరోవైపు, నెలనెలా బ్యాంకులో జమకావాల్సిన అద్దె రాకపోవడంతో దుబాయ్ నుంచి కైసర్ అద్దెకు ఉంటున్న వారికి ఫోన్ చేసి అడిగాడు. దీంతో అసలు విషయం వెలుగుచూసింది. ఇల్లు తాకట్టు పెట్టి తమ నుంచి ఇమ్రాన్ రూ.30 లక్షలు తీసుకున్నట్టు చెప్పడంతో ఆయన దుబాయ్ నుంచి వచ్చి మీర్‌చౌక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఇమ్రాన్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.