USA: తాలిబన్ల దుశ్చర్య.. రహస్య శాంతి చర్చల్ని రద్దుచేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్!
- కాబూల్ లో తాలిబన్ ఆత్మాహుతి దాడి
- ఓ అమెరికన్ జవాన్, 11 మంది మృతి
- తాలిబన్లపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్ద్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అఫ్గానిస్థాన్ లో ప్రభుత్వానికి పక్కలో బల్లెంలా తయారైన తాలిబన్ ఉగ్రసంస్థతో శాంతి చర్చలను రద్దుచేసుకుంటున్నట్లు ప్రకటించారు. తాలిబన్ సంస్థ ప్రతినిధులతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈరోజు మేరిల్యాండ్ లోని క్యాంప్ డేవిడ్ లో రహస్యంగా సమావేశం కావాల్సి ఉంది. అయితే తాలిబన్ సంస్థ అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్ లో గత వారం ఆత్మాహుతి దాడి చేయగా, ఓ అమెరికన్ సైనికుడితో పాటు 11 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో తీవ్రంగా కలత చెందిన ట్రంప్ తాలిబాన్లతో శాంతి చర్చలను రద్దుచేసుకుంటున్నట్లు తెలిపారు.
కీలక చర్చలు జరుగుతున్న సమయంలో కూడా తాలిబన్లు ఉగ్రదాడులకు పాల్పడితే, ఇక చర్చలు జరపాల్సిన అవసరమే లేదని స్పష్టం చేశారు. 2001, సెప్టెంబర్ 11న అమెరికాలోని ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీవో)తో పాటు పలు లక్ష్యాలపై ఉగ్రవాదులు ఆత్మహుతిదాడికి దిగిన సంగతి తెలిసిందే. ఇందుకు ఉగ్రసంస్థ అల్ కాయిదా అధినేత ఒసామా బిన్ లాడెన్ ను దోషిగా నిర్ధారించిన అమెరికా, ఆయన్ను పట్టుకునేందుకు అఫ్గానిస్థాన్ పై దాడిచేసింది.
అప్పటికే అక్కడ ఆటవిక ప్రభుత్వాన్ని నడుపుతున్న తాలిబన్లను ఓడించిన అమెరికా సేనలు, అఫ్గానిస్థాన్ లో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాయి. అయితే దీన్ని జీర్ణించుకోలేని తాలిబన్లు ఆత్మాహుతి దాడులతో తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో తాము మోహరించిన సైన్యంలో మెజారిటీ సైనికుల్ని వెనక్కి రప్పించుకుంటామని గతంలో ప్రకటించిన ట్రంప్.. మరికొంత కాలం అమెరికా సైన్యం అఫ్గానిస్థాన్ లోనే ఉంటుందని మాట మార్చారు.