Karnataka: వ్యవసాయం నుంచి మన యువత తప్పుకుంటోంది.. ఇది ప్రమాదకరమైన పరిస్థితి!: జగ్గీ వాసుదేవ్
- ‘కావేరీ పిలుస్తోంది’కి అనూహ్య స్పందన
- ఈ ఉద్యమానికి కర్ణాటక సీఎం యడ్యూరప్ప మద్దతు
- బెంగళూరులో చైతన్య సదస్సు నిర్వహణ
అత్యంత సారవంతమైన మన దేశ మట్టిని పోగొట్టుకున్నామని, వ్యవసాయం నుంచి మన యువత తప్పుకుంటోందని, ఇది కచ్చితంగా ప్రమాదకరమైన పరిస్థితి అని యోగి, సద్గురు జగ్గీ వాసుదేవ్ హెచ్చరించారు. జగ్గీ వాసుదేవ్ ఇచ్చిన ‘కావేరీ పిలుస్తోంది’ ప్రజా ఉద్యమానికి అనూహ్య స్పందన లభించింది. ఈ ఉద్యమానికి కర్ణాటక సీఎం యడ్యూరప్ప మద్దతు తెలిపారు. బెంగళూరులో నిర్వహించిన చైతన్య సదస్సులో యడ్యూరప్ప, జగ్గీ వాసుదేవ్, మైసూరు సంస్థాన రాజమాత ప్రమోదాదేవి, ప్రముఖ పారిశ్రామిక వేత్త కిరణ్ మజుందార్ షా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జగ్గీ వాసు దేవ్ మాట్లాడుతూ, కావేరీలో నీటి లభ్యత క్రమేపీ తగ్గిపోతోందని, అందువల్లే కర్ణాటక, తమిళనాడులో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. నదీ తీరంలో వృక్షాలు పెంచి రైతులకు ఆదాయం పెంచడం లక్ష్యం కావాలని, చెట్లు, పశువులు అటవీ ప్రాంతాల్లో ఉండాలని అన్నారు.
యూరియా లాంటి ఎరువుల వాడకం ఇబ్బందుల్లోకి నెడుతోందని, సారవంతమైన భూమిని కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మన దేశంలో జలాశయాలు మూడు, నాలుగు రోజుల్లోనే నిండుతున్నాయని, నీరు వేగంగా సముద్రంలోకి వెళ్లిపోయి, మన ప్రాంతాలు ఎడారిగా మారకూడదన్నదే తమ లక్ష్యం అని చెప్పారు. ‘కావేరీ’ ఒక్కటే కాదు 120కి పైగా ఉపనదులు పునర్జీవం కావాలి అని అన్నారు.
‘కావేరి’ని బతికించుకోవడం కూడా ప్రభుత్వ బాధ్యతే: సీఎం యడ్యూరప్ప
కావేరి నది పరిరక్షణకు కర్ణాటక ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని యడ్యూరప్ప హామీ ఇచ్చారు. ‘కావేరి’ని బతికించుకోవడం కూడా ప్రభుత్వ బాధ్యతే అని, నది పరిరక్షణకు కార్యాచరణ చేపడతామని స్పష్టం చేశారు. నిధుల కేటాయింపుపై కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకుంటామని అన్నారు.
పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు సహకరిస్తాం: రాజమాత ప్రమోదాదేవి
కావేరి నది పునరుజ్జీవం కోసం అంతా కలిసి రావాలని, సామాజిక బాధ్యతగా పరిగణించాలని ప్రమోదాదేవి సూచించారు. నది పరీవాహక ప్రాంతంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు సహకరిస్తామని, ప్రకృతిని విధ్వంసం చేస్తే ఎదురయ్యే దుష్పరిణామాలను మనమే ఎదుర్కోవాలని అన్నారు. పదేళ్లుగా సాగునీరు లేక వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు.
ఇప్పుడే జాగ్రత్తపడకపోతే ముప్పు తప్పదు: కిరణ్ మజుందార్ షా
ఉన్నత లక్ష్యానికి ప్రజలంతా మద్దతుగా నిలవాలని కిరణ్ మజుందార్ షా కోరారు. ‘కావేరి’లో నీటి లభ్యత 70 శాతానికి తగ్గిపోయింది, ఈ నదికి తిరిగి పునరుజ్జీవం కలిగించేందుకే ఈషా ఫౌండేషన్ ప్రయత్నిస్తోందని అన్నారు. ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థల సహకారం అందించాలని కోరారు. ముందు చూపుతో ఇప్పుడే జాగ్రత్తపడకపోతే ముప్పు తప్పదని హెచ్చరించారు.