Nissan: నిస్సాన్ కు రాజీనామా చేయనున్న సీఈఓ!
- అధికంగా వేతనం తీసుకున్న హిరోతో సైకావా
- అవకతవకలకు పాల్పడ్డారన్న నివేదిక
- తొలగించక ముందే రాజీనామా యోచన
ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న జపాన్ వాహన పరిశ్రమ దిగ్గజం నిస్సాన్, ఇప్పుడు మరిన్ని ఇబ్బందుల్లో పడింది. ఈ సంస్థ సీఈఓ హిరోతో సైకావా రాజీనామా చేయనున్నారు. ముందుగా అనుకున్న వేతనం కన్నా అధికంగా పుచ్చుకున్నారన్న ఆరోపణలు నిజమని తేలడంతోనే, ఆయన రాజీనామా చేసి, సంస్థను వీడేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. 'నిక్కీ బిజినెస్ డెయిలీ' ఈ వార్తను ప్రముఖంగా ప్రచురించింది. ఈ విషయంలో ఇప్పటివరకూ నిస్సాన్ అధికారికంగా స్పందించలేదు.
ఇదే సమయంలో సైకావా తన రాజీనామా విషయాన్ని బోర్డుకు తెలియజేశారని తెలుస్తోంది. ఆయన తరువాత సంస్థను ఎవరు నడిపించాలన్న విషయంలో సంస్థ ఇంకా ఓ నిర్ణయానికి రాలేదని సమాచారం. సైకివాకు ఇస్తున్న వేతనంపై విమర్శలు వెల్లువెత్తిన తరువాత, ఓ విచారణ కమిటీని నియమించగా, అవకతవకలను ఎత్తి చూపుతూ, ఆయన అధిక వేతనాన్ని తీసుకున్నారని నివేదికను సమర్పించింది.
కంపెనీ ఈక్విటీ వాటా విలువ, మరింతగా పెరిగితే డైరెక్టర్లతో పాటు ఉన్నతోద్యోగులు బోనస్ తీసుకోవచ్చన్న నిబంధనను ఆయన అతిక్రమించారని తేలింది. మొత్తం 4.40 లక్షల డాలర్లను ఆయన అధికంగా తీసుకున్నారని, అందుకోసం అడ్డదారులు తొక్కారని ఈ నివేదికలో బహిర్గతం కాగా, గత వారంలో మీడియా ముందుకు వచ్చిన సైకావా, తాను ఏ తప్పూ చేయలేదని వాదించారు.
ఇదిలావుండగా, బోర్డు డైరెక్టర్లు సమావేశమై సైకావాను తొలగించే విషయంలో నిర్ణయం తీసుకోనున్నారన్న వార్తలూ వస్తున్నాయి. ఆలోగానే తన పదవికి ఆయన రాజీనామా చేయవచ్చని సమాచారం. గతేడాది సంస్థలో బయటపడిన కుంభకోణం తరువాత, నిస్సాన్ ఈక్విటీ విలువ కుదేలైంది. ఆపై ఇంతవరకూ ఈక్విటీ విలువలో గరిష్ఠస్థాయిని అందుకోలేదు.