APPLE: యాపిల్ కంపెనీ చైనా కార్మికుల శ్రమను దోచుకుంటోంది.. ఎన్జీవో సంస్థ సంచలన నివేదిక!
- యాపిల్-ఫాక్స్ కాన్ కార్మిక చట్టాలను ఉల్లంఘించాయి
- భారీగా కాంట్రాక్టు ఉద్యోగులను నియమించుకున్నాయి
- ఆరోపణలను ఖండించిన రెండు కంపెనీలు
అమెరికాకు చెందిన టెక్నాలజీ దిగ్గజం యాపిల్ కంపెనీ ఇబ్బందుల్లో చిక్కుకుంది. చైనాలో తన ఉత్పత్తి కేంద్రాల్లో యాపిల్ కార్మిక చట్టాలను యథేచ్ఛగా ఉల్లంఘించిందనీ, నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్ట్ కార్మికులను భారీగా విధుల్లోకి తీసుకుందని ‘చైనా లేబర్ వాచ్’ అనే ఎన్జీవో సంస్థ నివేదిక విడుదల చేసింది. యాపిల్, తన భాగస్వామి ఫాక్స్ కాన్ తో కలిసి ఈ ఉల్లంఘనలకు పాల్పడిందని తెలిపింది. తమ పరిశోధకులు జ్గెంగ్ జౌ ప్రావిన్సులోని ఐఫోన్ ఫ్యాక్టరీ నుంచి రహస్యంగా ఈ సాక్ష్యాలు సేకరించారని వెల్లడించింది. అంతేకాకుండా యాపిల్ కంపెనీ తన ఉద్యోగులకు బోనస్ ఇవ్వకుండా నిలిపివేసిందని పేర్కొంది.
చైనా ప్రభుత్వం అమెరికా ఉత్పత్తులపై విధిస్తున్న సుంకాల నుంచి తప్పించుకునేందుకు యాపిల్ స్థానిక కార్మికుల శ్రమను దోపిడీ చేస్తోందని విమర్శించింది. కాగా, ఈ ఆరోపణలను యాపిల్ ఖండించింది. అయితే కాంట్రాక్టు ఉద్యోగులను మాత్రం అధిక సంఖ్యలో నియమించుకున్నామనీ, వారికి ఆకర్షణీయమైన వేతనాలు ఇచ్చామని అంగీకరించింది. ఓవర్ టైమ్ పనిచేసిన వారికి అదనంగా వేతనాలు చెల్లించామనీ, అయితే పర్మినెంట్ ఉద్యోగులకు ఇచ్చిన సౌకర్యాలను మాత్రం వీరికి ఇవ్వలేదని స్పష్టం చేసింది.
మరోవైపు తమ ఫ్యాక్టరీలో కాంట్రాక్ట్ కార్మికుల సంఖ్య అధికమైందన్న ఫాక్స్ కాన్, తాము ఎవరినీ బలవంతంగా పనిచేయించడం లేదని తేల్చిచెప్పింది. యాపిల్ కంపెనీ తమ కొత్త ఐఫోన్ ను రేపు విడుదల చేయనున్న నేపథ్యంలో ఈ వివాదం తెరపైకి రావడం గమనార్హం. అన్నట్లు చైనాలో యాపిల్ ఉత్పత్తులకు మహా డిమాండ్ ఉంటుంది. కొందరు యువతీయువకులు ఐఫోన్ ను కొనుగోలు చేసేందుకు తమ కిడ్నీలను అమ్ముకున్న ఉదంతాలు కూడా గతంలో వెలుగులోకి వచ్చాయి.