Telangana: ఇప్పటికీ ‘రైతు బంధు’ మొదటి విడత డబ్బులు రాలేదు: ఎమ్మెల్సీ నర్సిరెడ్డి విమర్శలు
- తెలంగాణ ప్రభుత్వంపై నర్సిరెడ్డి విమర్శలు
- ఈ పథకాన్ని కొనసాగిస్తారన్న నమ్మకం లేదు
- ప్రభుత్వ వైఫల్యాలను ఆర్థికమాంద్యంపై నెట్టొద్దు
తెలంగాణలో రైతుబంధు పథకాన్ని యథావిధిగా కొనసాగిస్తామని ప్రభుత్వం చెప్పడంపై ఎమ్మెల్సీ నర్సిరెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. టీ-అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ, అసెంబ్లీలో ఈరోజు ప్రవేశపెట్టిన తెలంగాణ బడ్జెట్ నిరాశాజనకంగా ఉందని విమర్శించారు.
ఇప్పటికీ ఈ పథకానికి సంబంధించి మొదట విడత డబ్బులు దాదాపు నలభై శాతం మందికి తమ అకౌంట్లలో జమ కాలేదని విమర్శించారు. నిధులు విడుదల కావడం లేదన్న విషయం స్పష్టంగా అర్థమౌతోంది కనుక ఈ పథకాన్ని కొనసాగిస్తారన్న నమ్మకం లేదని అనుమానం వ్యక్తం చేశారు. దేశంలో గానీ, రాష్ట్రంలో గానీ ఆర్థిక మాంద్యం ఏర్పడితే దాన్ని తట్టుకునేందుకు ఆర్థిక విధానాలను మెరుగుపరిచే విధానాలను అవలంబించాలని సూచించారు. అంతేతప్ప ప్రభుత్వ వైఫల్యాలను ఆర్థికమాంద్యంపై నెట్టడం సమంజసం కాదని, రాష్ట్ర బడ్జెట్ తృప్తికరంగా లేదని, దీనిపై పున:పరిశీలించాలని డిమాండ్ చేశారు.