Maharashtra: 20వ సారి గర్భం దాల్చిన మహిళ.. విషయం తెలిసి వైద్యుల షాక్
- 16సార్లు ఇంట్లోనే కాన్పు
- మూడుసార్లు గర్భస్రావం
- ప్రస్తుతం ఏడు నెలల గర్భవతి
16సార్లు ఇంట్లోనే పురుడు పోసుకున్న మహిళ 17వ సారి ఆసుపత్రికి వచ్చింది. అంతేకాదు, ఆమె గర్భం ధరించడం ఇది ఏకంగా 20వ సారి కావడంతో వైద్యులు విస్తుపోయారు. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలోని కేశపురి ప్రాంతానికి చెందిన 38 ఏళ్ల లంకాబాయి ఖరత్ ఏడునెలల గర్భవతి. పరీక్షల కోసం తాజాగా ఆసుపత్రికి వచ్చింది. ఆమెను పరీక్షించిన వైద్యులు షాకయ్యారు. ఆమె 20వ సారి గర్భం దాల్చినట్టు తెలుసుకుని నోరెళ్లబెట్టారు.
లంకాబాయి ఇప్పటి వరకు 16సార్లు ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రసవించింది. మూడుసార్లు గర్భస్రావం అయింది. ఐదుసార్లు మాత్రం పుట్టిన పిల్లలు కొన్ని గంటల వ్యవధిలో మృతి చెందారు. ప్రస్తుతం ఆమెకు 11 మంది పిల్లలున్నారు. లంకాబాయి విషయం తెలిసిన బీడ్ జిల్లా సివిల్ సర్జన్ డాక్టర్ అశోక్ థొరాట్ ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేశారు. ప్రస్తుతం ఆమె ఏడు నెలల గర్భంతో ఉందని, తల్లి, గర్భంలోని శిశువు ఆరోగ్యంగా ఉన్నారని ఆయన తెలిపారు. ఇన్నిసార్లు గర్భం ధరించడం వల్ల నెలలు నిండకుండానే ప్రసవమయ్యే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు.