RC Bhargava: కార్ల ధరలు పెరిగిపోతున్నాయి.. పరిస్థితి దారుణంగా ఉంది!: మారుతి సుజుకి చైర్మన్ ఆర్సీ భార్గవ

  • మారిన నిబంధనలతో ధరలు ప్రియం
  • రూ. 50 వేల వరకూ పెరిగిన ధర
  • ధరలను అదుపు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే
  • బైక్ నుంచి కారుకు అప్ గ్రేడ్ కావడం కష్టమేనన్న భార్గవ

ఇండియాలో కార్లను కొనాలనుకునే వారు భయపడాల్సిన పరిస్థితి నెలకొందని, రోజురోజుకూ ధరలు పెరుగుతూనే ఉన్నాయని మారుతి సుజుకి చైర్మన్ ఆర్సీ భార్గవ కీలక వ్యాఖ్యలు చేశారు. మారిన సేఫ్టీ నిబంధనలు కూడా ద్విచక్ర వాహన వినియోగదారులను కార్లకు దూరం చేస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. కార్లలో ఎయిర్ బ్యాగ్స్, ఏబీఎస్ వంటివి తప్పనిసరి కావడం, బ్యాంకుల నుంచి రుణ లభ్యత క్లిష్టం కావడం కూడా అమ్మకాలపై ప్రభావం చూపుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇప్పటికే వాహన అమ్మకాలు చరిత్రలోనే కనిష్ఠానికి పడిపోయిన నేపథ్యంలో, పెరిగిన పన్నులు, పెట్రోలు, డీజిల్  ధరల పెరుగుదల, రిజిస్ట్రేషన్ చార్జీలను పలు రాష్ట్రాల ప్రభుత్వాలు అడ్డగోలుగా పెంచడం తదితరాలు కార్ల కొనుగోలుదారులపై భారాన్ని మోపుతున్నాయని ఆర్సీ భార్గవ అభిప్రాయపడ్డారు. కేవలం జీఎస్టీని తాత్కాలికంగా తగ్గించినంత మాత్రాన పరిస్థితి ఆశాజనకంగా మారుతుందని తాను భావించడం లేదని అన్నారు. వాహనాలపై ఉన్న 28 శాతం జీఎస్టీని 18 శాతానికి తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎవరైనా ద్విచక్ర వాహనాన్ని నడుపుతూ, కారుకు అప్ గ్రేడ్ కావాలని భావించే వారికి, ప్రస్తుతమున్న నిబంధనలు, అడ్డంకిగా మారాయని ఆర్సీ భార్గవ అన్నారు.

అన్ని వైపుల నుంచి వచ్చిన ఒత్తిళ్లతో కార్ల ధరలు సగటున రూ. 55 వేల వరకూ పెరిగాయని, ఇందులో రూ. 20 వేల వరకూ రోడ్ టాక్స్ రూపంలోనే చెల్లించాల్సి వస్తోందని ఆయన అన్నారు. బ్యాంకులు ఏ మాత్రం రిస్క్ ను కూడా భరించే పరిస్థితుల్లో లేవని, దీంతో కార్ల కొనుగోలుకు రుణాలు క్లిష్టతరమయ్యాయని అన్నారు.

అభివృద్ధి చెందిన దేశాలతో ఇండియాను పోల్చుకునే పరిస్థితి లేదని, భారత్ లో తలసరి ఆదాయం 2,200 డాలర్లు కాగా, అదే చైనాలో 10 వేల డాలర్లు, యూరప్ లో 40 వేల డాలర్లు ఉందని గుర్తు చేసిన ఆయన, ఇండియాలో కార్ల ధరలను మధ్య తరగతి, ఎగువ మధ్యతరగతికి అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని తెలిపారు.

  • Loading...

More Telugu News