Telugudesam: టీడీపీ నాయకుల దుష్ప్రచారాన్ని అడ్డుకుంటాం.. రేపు వైసీపీ ‘ఛలో ఆత్మకూరు’: అంబటి రాంబాబు
- రేపు ఉదయం 9 గంటలకు గుంటూరు నుంచి ‘ఛలో ఆత్మకూరు’
- ఐదేళ్ల చంద్రబాబు పాలనలో దారుణాలు జరిగాయి
- టీడీపీ బాధితులందరికీ చంద్రబాబు సమాధానం చెప్పాలి
టీడీపీ శ్రేణులపై వైసీపీ దాడులను నిరసిస్తూ రేపు ‘ఛలో ఆత్మకూరు’ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ తలపెట్టిన విషయం తెలిసిందే. అయితే, టీడీపీ నాయకుల దుష్ప్రచారాన్ని అడ్డుకుంటామని, తాము కూడా రేపు ‘ఛలో ఆత్మకూరు’ నిర్వహిస్తామని వైసీపీ నేత అంబటి రాంబాబు స్పష్టం చేశారు. గుంటూరులో ఈరోజు పల్నాడు ప్రాంత వైసీపీ ప్రజాప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న అంబటి మాట్లాడుతూ, రేపు ఉదయం తొమ్మిది గంటలకు గుంటూరులోని వైసీపీ కార్యాలయం నుంచి ‘ఛలో ఆత్మకూరు’కు పిలుపు నిస్తున్నట్టు చెప్పారు. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో దారుణాలు జరిగాయని. వైసీపీ కార్యకర్తలపై టీడీపీ దాడులు చేసి గాయపర్చిన సందర్భాలు అనేకం ఉన్నాయని ఆరోపించారు.
చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు సత్తెనపల్లిలో కోడెల శివప్రసాద్, గురజాలలో యరపతినేని, వినుకొండలో జీవీ ఆంజనేయులు, చిలకలూరిపేటలో ప్రత్తిపాటి పుల్లారావు తమ కార్యకర్తలను పలు ఇబ్బందులు పెట్టారని, వారితో కలిసి ‘ఛలో ఆత్మకూరు’ వెళ్తున్నట్టు చెప్పారు. టీడీపీ బాధితులందరికీ చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు విషప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి అంతానికి తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే గందరగోళం సృష్టించేందుకు బాబు యత్నిస్తున్నారని మండిపడ్డారు. జగన్ సీఎం అయ్యాక పల్నాడులో మరింత ప్రశాంతత చేకూరిందని, కక్ష సాధింపు చర్యలకు పాల్పడకూడదనేది సీఎం జగన్ పాలసీ అని చెప్పారు.