Chandrababu: చంద్రబాబు గిమ్మిక్కులు మాకు తెలుసు: మంత్రి బొత్స
- శాంతి భద్రతల విషయంలో ఎవరినీ ఉపేక్షించం
- చట్టాన్ని అతిక్రమిస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే
- మాది స్నేహ పూర్వక ప్రభుత్వం
రేపు టీడీపీ తలపెట్టిన ‘ఛలో ఆత్మకూరు’పై మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు గిమ్మిక్కులు తమకు తెలుసని అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో ఎవరినీ ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధులు శాంతిభద్రతలకు విఘాతం కలిగించకూడదని సూచించారు. చట్టాన్ని అతిక్రమిస్తే ఎవరైనా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. తమది స్నేహపూర్వక ప్రభుత్వం అని, ఈ ప్రభుత్వం ఉద్యోగుల యోగ క్షేమాలు చూస్తోందని అన్నారు. అవినీతి రహిత పాలనకు సీఎం జగన్ కృషి చేస్తున్నారని, అందరూ సహకరించాలని కోరారు.
వ్యవస్థలను కాపాడాలన్నది జగన్ ఆశయమని, అందుకు అనుగుణంగా ఉద్యోగులు పనిచేయాలని, మనం అందరమూ ప్రజలకు జవాబుదారీగా ఉండాలని అన్నారు. సీపీఎస్ రద్దుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, సబ్ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత చర్చించి తగు న్యాయం చేస్తామని చెప్పారు. కొందరు ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తున్నారని, వాటిని నమ్మొద్దని కోరారు.