Karnataka: కర్ణాటకలో గణేశ్ నిమజ్జనంలో అపశ్రుతి.. చెరువులోకి దిగి ఆరుగురు చిన్నారుల మృతి

  • కర్ణాటకలోని మరథఘట్ట గ్రామంలో ఘటన
  • చెరువులోకి దిగిన ఆరుగురూ మృతి
  • బాధిత కుటుంబాలకు రూ. 2 లక్షల పరిహారం

కర్ణాటకలోని కేజీఎఫ్ తాలూకాలోని మరథఘట్ట గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. వినాయక విగ్రహ నిమజ్జనం కోసం చెరువులోకి దిగిన ఆరుగురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. 8 నుంచి 12 ఏళ్ల వయసున్న 8 మంది చిన్నారులు వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు గ్రామంలోని చెరువు వద్దకు వెళ్లారు. వీరిలో ఇద్దరు చిన్నారులు ఒడ్డున నిల్చోగా, మిగతా ఆరుగురు నీటిలో దిగారు.

నీటిలోకి దిగిన చిన్నారులు మునిగిపోతున్న విషయాన్ని గమనించిన ఒడ్డున ఉన్న ఇద్దరు గ్రామంలోకి పరుగులు పెట్టారు. గ్రామస్థులకు విషయం చెప్పి చెరువు వద్దకు తీసుకొచ్చారు. అయితే, అప్పటికే వారు మునిగిపోయి మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని చిన్నారుల మృతదేహాలను వెలికి తీశారు. మృతి చెందిన వారిలో  వైష్ణవి (12), ఆమె సోదరుడు రోహిత్ (10), తేజశ్రీ (11), ఆమె సోదరి రక్షిత (8), రోహిత్ (10), ధనుష్ (10)లు ఉన్నారు. విషయం తెలిసిన ముఖ్యమంత్రి యడియూరప్ప తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు.

  • Loading...

More Telugu News