mahanimajjanam: హైదరాబాద్‌ లో రేపు గణేశ్‌ మహానిమజ్జనం: హుస్సేన్‌ సాగర్‌కు 20 వేల విగ్రహాలు

  • మధ్యాహ్నం 12లోగా ఖైరతాబాద్ వినాయకుడి జలసమాధి
  • 36 గంటలపాటు కార్యక్రమం కొనసాగే అవకాశం
  • పటిష్ట ఏర్పాట్లు చేశాం : ఏసీపీ అనిల్‌కుమార్‌

హైదరాబాద్‌లో గణేశ్‌ ఉత్సవాలు ముగింపు దశకు వచ్చేశాయి. మహానిమజ్జనం (శోభాయాత్ర) కార్యక్రమం గురువారం కన్నులపండువగా ప్రారంభం కానుంది. రేపు ఉదయం 9 గంటలకు శోభాయాత్ర ప్రారంభమవుతుంది. బాలాపూర్‌ నుంచి ప్రారంభమయ్యే యాత్ర చాంద్రాయణగుట్ట, చార్మినార్‌, మదీనా, ఆఫ్జల్‌గంజ్‌, ముజాంజాహీ మార్కెట్‌, అబిడ్స్‌, బషీర్‌బాగ్‌ లిబర్టీ మీదుగా హుస్సేన్‌సాగర్‌ వరకు కొనసాగుతుంది. అందువల్ల శోభాయాత్ర జరిగే మార్గంలోకి విగ్రహాలున్న వాహనాలు తప్ప ఇతర వాహనాలను అనుమతించరు. అయితే ఆయా ప్రాంతాల్లోని ఆసుపత్రులకు వచ్చే అంబులెన్స్‌లు, అత్యవసర వాహనాలకు మినహాయింపు ఇచ్చారు.

మహానిమజ్జనం రోజున హుస్సేన్‌సాగర్‌కు దాదాపు 20 వేల విగ్రహాలు తరలి వచ్చే అవకాశం ఉందని పోలీసులు అంచనా వేస్తున్నారు. దీంతో నిమజ్జన కార్యక్రమం దాదాపు 36 గంటలపాటు సాగుతుందని భావించి అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం అర్ధరాత్రి వరకు ఎన్టీఆర్‌ మార్గ్‌, ట్యాంక్‌బండ్‌పై నుంచి నిమజ్జనం ప్రక్రియ కొనసాగుతుంది. అప్పటికీ ఇంకా విగ్రహాలు నిమజ్జనానికి మిగిలి ఉంటే శుక్రవారం ట్యాంక్‌బండ్‌, లిబర్జీ, ఎన్టీఆర్‌ మార్గ్‌ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు చేయనున్నారు.

‘శోభాయాత్రను దృష్టిలో పెట్టుకుని ఎటువంటి ట్రాఫిక్‌ సమస్యలు ఎదురుకాకుండా పలు ప్రాంతాల్లో ఆంక్షలు విధించనున్నాం. ప్రజలు, భక్తులు సహకరించాలి’ అని అదనపు పోలీసు కమిషనర్‌ (ట్రాపిక్‌) అనిల్‌కుమార్‌ తెలిపారు. మహానగరంలో వెలసిన అతి పెద్దదైన ఖైరతాబాద్‌ వినాయకుడి నిమజ్జనం మధ్యాహ్నం 12 గంటల్లోగా పూర్తయ్యేందుకు అవసరమైన చర్యలు చేపట్టినట్లు ఏసీపీ తెలిపారు.

నిమజ్జనం కార్యక్రమాన్ని చూడాలని వచ్చే వారు ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించుకోవాలని ఏసీపీ సూచించారు. కాగా మంగళవారం రాత్రి వరకు దాదాపు 50 వేల విగ్రహాలను సాగర్‌లో నిమజ్జనం చేశారు.

  • Loading...

More Telugu News