Andhra Pradesh: తెలుగుదేశం నేతలు ఏపీలో ఫినాయిల్ ను కూడా వదల్లేదు!: గురజాల ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి
- చంద్రబాబు హింసను ప్రోత్సహించారు
- పల్నాడు శాంతియుతంగా ఉంటే ఓర్వలేకపోతున్నారు
- గుంటూరులో కాసు మీడియా సమావేశం
ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు ప్రతీసారి హింసను ప్రోత్సహించారని వైసీపీ నేత, గురజాల ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి విమర్శించారు. ఫ్యాక్షన్ తో గతంలో పల్నాడు అల్లాడిపోయిందని వ్యాఖ్యానించారు. అయితే టీడీపీ వచ్చాక గత ఐదేళ్లలో ‘పల్నాడులో బందిపోట్లు పడ్డారు’ అని స్థానికుల్లో ఎవర్ని అడిగినా చెబుతారన్నారు. కాసు బ్రహ్మానందరెడ్డి, వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పల్నాడు ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పారు.
ఏపీ సీఎం జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన 3 నెలల్లోనే గవర్నమెంట్ మెడికల్ కాలేజీ, గురజాల, దాచేపల్లిని మున్సిపాలిటీ చేయడం, రూ.2,000 కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు.. ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని పేర్కొన్నారు. గుంటూరులో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో వైసీపీ నేతలతో కలిసి కాసు మహేశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పల్నాడు ప్రాంతంలో వైసీపీ ప్రభుత్వం శాంతిని నెలకొల్పి అభివృద్ధి చేస్తుంటే తమ ఉనికికే ప్రమాదమని టీడీపీ నేతలు భయపడుతున్నారని కాసు మహేశ్ రెడ్డి తెలిపారు.
టీడీపీ హయాంలో ఇసుక, మట్టి, నీరు, నకిలీ విత్తనాల కుంభకోణాలు, లైంగిక దాడులు జరిగాయనీ, చివరికి అసెంబ్లీలో ప్లాస్టిక్ కుర్చీలను కూడా వదలని టీడీపీ నాయకులు తమను విమర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా తాగుతారని ఓ సామెత ఉందనీ, టీడీపీ నేతలు ఏపీలో ఆ ఫినాయిల్ ను కూడా వదలలేదని దుయ్యబట్టారు. గత 10 రోజుల నుంచి తాము పల్నాడులో బహిరంగ విచారణ చేపడతామని కోరుతూనే ఉన్నామని స్పష్టం చేశారు.
చంద్రబాబు పల్నాడుకు రావాలనుకుంటే రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలు ఎందుకని ప్రశ్నించారు. చంద్రబాబుతో పాటు కోడెల, యరపతినేని వస్తే ప్రజలకు నిజాలు తెలుస్తాయని వ్యాఖ్యానించారు. ఛలో ఆత్మకూరులో భాగంగా తాము బాధితులను కలుసుకుని నిజాలను ప్రజల ముందు బయటపెడతామని వ్యాఖ్యానించారు. జగన్ సీఎం అయ్యాక పల్నాడు రైతులు పత్తి, మిరప, వరి పంటలను వేసుకుంటున్నారనీ, పంటపొలాలు పచ్చగా ఉన్నాయని చెప్పారు.