Andhra Pradesh: ఇంకా ఐదేళ్లు ఎలా తట్టుకుంటారు చంద్రబాబూ!: విజయసాయిరెడ్డి
- మా ప్రభుత్వంపై ఇన్ని కుట్రలా?
- జూనియర్ ఆర్టిస్టులతో బాధితుల వేషాలు వేయించారు
- వాలంటీర్లకు పెళ్లిళ్లు కావని శాపనార్థాలు పెట్టారు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ‘ఛలో ఆత్మకూరు’ కార్యక్రమం వేడిని పుట్టిస్తోంది. ఈ విషయంలో అటు తెలుగుదేశం, ఇటు వైసీపీ నేతలు ఆరోపణలు-ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు వైసీపీ ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలకు వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. ప్రజలు అఖండ మెజారిటీతో గెలిపించిన తమ ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాలు చేసేందుకు టీడీపీ కుట్రలు పన్నుతోందని విజయసాయిరెడ్డి ఆరోపించారు.
ఈరోజు ట్విట్టర్ లో విజయసాయిరెడ్డి స్పందిస్తూ..‘ప్రజలు అఖండ మెజారిటీతో గెలిపించిన ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాలు చేయడానికి ఇన్ని కుట్రలా? జూనియర్ ఆర్టిస్టులతో వరద బాధితుల వేషాలు. పల్నాడు వేధింపుల పేరుతో శిబిరాలు, నాణ్యమైన బియ్యం పైనా ఏడుపులు. వాలంటీర్లకు పెళ్లిళ్లు కావని శాపాలు. అసలు ఐదేళ్లు ఎలా తట్టుకుంటారు చంద్రబాబు గారూ?’ అని ప్రశ్నించారు. ఈ ట్వీట్ కు చంద్రబాబు, నారా లోకేశ్ లను విజయసాయిరెడ్డి ట్యాగ్ చేశారు.