Andhra Pradesh: టచ్ చేయవద్దు.. నా రూమ్ లోకి వచ్చే అధికారం మీకుందా?: పోలీసులపై భూమా అఖిలప్రియ ఆగ్రహం
- నేడు టీడీపీ ఛలో ఆత్మకూరు కార్యక్రమం
- తన గదిలోకి పోలీసులు రావడంపై అఖిలప్రియ ఫైర్
- విజయవాడలో హోటల్ లో నిర్బంధించిన పోలీసులు
తెలుగుదేశం నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియను పోలీసులు ఈరోజు హౌస్ అరెస్ట్ చేశారు. ఛలో ఆత్మకూరు కార్యక్రమంలో పాల్గొనేందుకు విజయవాడకు చేరుకున్న అఖిలప్రియ, ఆమె సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డిలను వారు ఉంటున్న హోటల్ గదిలోనే నిర్బంధించారు. ఈ సందర్భంగా గదిలోకి వచ్చిన మహిళా పోలీసులపై భూమా అఖిలప్రియ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ‘మేడమ్ టచ్ చేయకండి. మీరు రూమ్ లోకి వెళ్లే అథారిటీ ఉందా? మీరు నా గదిలోకి వెళ్లారా? లేదా? నేను గదిలో ఉన్నానో లేదో చెక్ చేసే అధికారం మీకు ఉందా? నేను బెడ్రూమ్ లో ఉన్నానో లేదో అని చెక్ చేస్తారా?
నేను హోటల్ వదిలేసి వెళితేనే కదా మీకు ప్రాబ్లమ్. రూమ్ నుంచి నేను బయటకు రాకూడదని ఎవరు చెప్పారు? మీరు నన్ను టచ్ చేయకండి ముందు’ అంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అఖిలప్రియ తన గది నుంచి బయటకొచ్చేందుకు వీల్లేదని పోలీసులు స్పష్టం చేసినప్పటికీ, అఖిలప్రియ లిఫ్ట్ ద్వారా కిందకు వెళ్లేందుకు ప్రయత్నించారు.
ఈ సందర్భంగా ఆమెను మగ పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో ఇటు టీడీపీ మద్దతుదారులు, అటు పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.