Nayini: ఏదో చిన్నగా చిట్ చాట్ చేస్తే.. పెద్ద వార్తగా రాశారు: నాయిని
- నాపై వచ్చిన వార్తలపై కేటీఆర్ అడిగారు
- కేసీఆర్ పిలిస్తే వెళ్లి మాట్లాడతా
- ఛైర్మన్ పదవి ఇచ్చినా అందులో వారే రసం పోస్తారు
తనకు మంత్రి పదవి ఇస్తానని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ మాట తప్పారని టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. హోం మంత్రిగా పని చేసిన తాను ఛైర్మన్ పదవులను ఎలా తీసుకుంటానని ఆయన ప్రశ్నించారు. గులాబీ జెండాకు తామంతా ఓనర్లమేనని ఆయన వ్యాఖ్యానించారు. నాయిని చేసిన వ్యాఖ్యలు టీఆర్ఎస్ లో చర్చనీయాంశమయ్యాయి.
తాజాగా ఈరోజు మీడియాతో మరోసారి చిట్ చాట్ చేస్తూ... తనపై వచ్చిన వార్తలపై కేటీఆర్ అడిగారని నాయిని చెప్పారు. మీడియాతో ఏదో చిన్నగా చిట్ చాట్ చేస్తే... పెద్ద వార్తగా రాశారని అన్నారు. తనను సీఎం కేసీఆర్ పిలిస్తే వెళ్లి మాట్లాడతానని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ తమదేనని... అందులో ఉన్న పదవులు కూడా తమకే వస్తాయని తెలిపారు. ఆర్టీసీ ఛైర్మన్ పదవిలో రసం లేదని ఇంతకు ముందు చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఛైర్మన్ పదవి ఇచ్చినా అందులో వారే రసం పోస్తారని చెప్పారు.