Andhra Pradesh: మహిళా ఎస్సై చేసిన ఆరోపణలు నిరూపిస్తే నేను ఆత్మహత్యకు సిద్ధం: నన్నపనేని రాజకుమారి
- ఆమెను కించపరిచే వ్యాఖ్యలు చేయలేదు
- ఆ ఆరోపణలు కరెక్టు కాదు
- మహిళా కమిషన్ చైర్మన్ పదవికి బలవంతంగా రాజీనామా చేయించారు
‘ఛలో ఆత్మకూరు’ సందర్భంగా టీడీపీ నేత, ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్మన్ నన్నపనేని రాజకుమారిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నన్నపనేని రాజకుమారి తనను కులం పేరిట దూషించారని ఓ మహిళా ఎస్సై ఆరోపించడం విదితమే. ఈ ఆరోపణలపై నన్నపనేని స్పందించారు.
ఆమెను కించపరిచేలా తాను ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని, ఆ ఆరోపణలు కరెక్టు కాదని స్పష్టం చేశారు. మహిళా ఎస్సైని అవమానకరంగా మాట్లాడినట్టు నిరూపిస్తే ఆత్మహత్య చేసుకునేందుకు తాను సిద్ధమని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై ఆమె నిప్పులు చెరిగారు.
వైసీపీ సర్కార్ తనను మానసిక వేధింపులకు గురి చేసి మహిళా కమిషన్ చైర్మన్ పదవికి బలవంతంగా రాజీనామా చేయించిందని ఆరోపించారు. రాజీనామా చేసినా ప్రభుత్వం తనను వదలడం లేదని విమర్శించారు.