monkeys festive: రండి రండి దయచేయండి.. ఓనం రోజు వానరాలకు భలే విందు!

  • పంచభక్ష్య పరమాన్నాలతో ఆతిథ్యం
  • కేరళలోని సడ్తంకొట్ట ఆలయంలో మూడున్నర దశాబ్దాలుగా సంప్రదాయం
  • బలిచక్రవర్తి ఆత్మ వానర రూపంలో తిరుగుతుందని నమ్మకం
శుభకార్యం చేసుకుంటే బంధుమిత్రులకు ఆహ్వానం పలికి మంచి ఆతిథ్యాన్ని అందించి వారి ఆశీర్వాదం తీసుకోవడం మన సంప్రదాయం. కేరళలోని ఓ ప్రాంతంలో మాత్రం అచ్చెరువొందించే విధానం ఉంది. ఓనం పండుగ రోజు ఇక్కడి వారు తమ బంధుమిత్రులకు మల్లే వానరాలకు పంచభక్ష్య పరమాన్నాలతో అతిథ్యం ఇచ్చి వాటిని సంతృప్తి పరుస్తారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా తమ సంప్రదాయంలో భాగంగా దశాబ్దాలుగా ఈ ఆచారాన్ని వారు కొనసాగిస్తున్నారు.

వివరాల్లోకి వెళితే...కేరళీయులకు ఓనం పెద్ద పండుగల్లో ఒకటి. ఈ రోజున విష్ణుమూర్తిని వామన అవతారంలో కొలుస్తారు. కేరళలోని కొల్లాం జిల్లా సడ్తంకొట్ట వాసులది మరో నమ్మకం. వామన చక్రవర్తి చేతిలో హతమైన మహాబలి చక్రవర్తి ఆత్మ  ఓనం పండుగ రోజు వానర రూపంలో వస్తుందని వారి నమ్మకం. అందుకే స్థానిక ఆలయంలో వానరాలకు వారు విందు ఏర్పాటు చేస్తారు. అలా బలి చక్రవర్తి ఆత్మకు తర్పణం అందిస్తారు.

35 ఏళ్ల క్రితం అరవిందక్షణ్‌ నాయర్‌ అనే స్థానికుడు ఓనం పండుగ రోజు ఇలా వానరాలకు విందు ఇచ్చే ఆనవాయితీని ప్రారంభించాడు. అప్పటి నుంచి ఏటా కులమతాలకు అతీతంగా ఆ ప్రాంత ప్రజలు వానరాలకు ఆతిథ్యం ఇస్తూ ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఈ ఏడాది కూడా అలాగే రుచికరమైన వంటకాలు వండి అరటాకుల్లో వడ్డించారు. వందలాది వానరాలు వచ్చి తృప్తిగా భోజనం చేసి వెళ్లాయి.
monkeys festive
Kerala
kollam district
sadthamkotta
onam feast

More Telugu News