Hyderabad: అంతకంతకూ పెరుగుతూ వచ్చిన.. బాలాపూర్ 'లడ్డూ వేలం' చరిత్ర ఇది!

  • గణేశ్ లడ్డూ చేజిక్కించుకుంటే శుభం కలుగుతుందన్న నమ్మకం 
  • గత సంవత్సరం రూ. 16.60 లక్షలు పలికిన లడ్డు
  • ఈ సంవత్సరం ఆర్థిక మాంద్యంతో ధర తగ్గవచ్చన్న అనుమానం

వినాయకుడి చేతిలోని లడ్డూ... సకల శుభాలను, అష్టైశ్వర్యాలనూ కలిగిస్తుందని భక్తులు నమ్మే మహా ప్రసాదం. 11 రోజుల పాటు భక్తులకు దర్శనమిస్తూ, వారితో ప్రత్యేక పూజలు అందుకునే గణనాధుని చేతిలో ఉంచే లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకునేందుకు వందలాది మంది పోటీ పడుతుంటారు. గణేష్ లడ్డూ వేలం అనగానే, తెలుగు రాష్ట్రాల్లో మొదట గుర్తుకు వచ్చేది, హైదరాబాద్ పరిధిలోని బాలాపూర్ లడ్డూనే. వందల్లో మొదలై, వేలు దాటి, లక్షల్లోకి సాగే బాలాపూర్ లడ్డూ గత చరిత్రను ఓమారు పరిశీలిస్తే...

1994లో తొలిసారిగా బాలాపూర్ లడ్డూను వేలం వేశారు. ఆ సంవత్సరం కోలన్ మోహన్ రెడ్డి రూ. 450కి లడ్డూను సొంతం చేసుకున్నారు. 1995లోనూ ఆయనే రూ. 4,500కు పాడారు. 1996లో ఆయన బంధువు కోలన్ కృష్ణారెడ్డి రూ. 18,000కు లడ్డూను అందుకున్నారు. ఆ మరుసటి సంవత్సరం కూడా ఆయనే రూ. 28 వేలకు లడ్డూను పాడారు. 1998లో తిరిగి కొలన్ మోహన్ రెడ్డి రూ. 51 వేలకు లడ్డూను పాడి దక్కించుకున్నారు.

1994 నుంచి 1998 మధ్య కాలంలో కొలన్ ఫ్యామిలీ ఆస్తుల విలువ గణనీయంగా పెరగడంతో, ఈ లడ్డూను సొంతం చేసుకుంటే అభివృద్ధి చెందవచ్చన్న ఆలోచన మిగతా గ్రామవాసుల్లో ఏర్పడింది. దీంతో 1999లో లడ్డూ కోసం పోటీ పెరిగింది. కళ్లెం ప్రతాపరెడ్డి రూ. 65 వేలకు లడ్డూను సొంతం చేసుకున్నారు. ఏడాది తిరిగేసరికి ప్రతాప్ రెడ్డికి శుభం కలిగిందని ప్రచారం జరగడంతో, ఆయన బంధువు కళ్లెం అంజిరెడ్డి పోటీకి దిగి రూ. 66 వేలకు 2000 సంవత్సరంలో లడ్డూను సొంతం చేసుకున్నారు.

2001 వచ్చేసరికి బాలాపూర్ లడ్డూ ఖ్యాతి నలుదిశలా వ్యాపించింది. ఆ సంవత్సరంలో జి.రఘునాధాచారి రూ. 85 వేలకు లడ్డూను వేలం పాడగా, 2002లో కందాడ మాధవరెడ్డి రూ. 1,05,000 వేలకు పాటను పెంచారు. 2003లో చిరిగింత బాల్ రెడ్డి రూ. 1,55,000కు లడ్డూను సొంతం చేసుకున్నారు. 2004లో కోలన్ మోహన్ రెడ్డి రూ. 2,01,000కు లడ్డూను దక్కించుకున్నారు. 2005లో ఇబ్రం శేఖర్ రూ. 2.08 లక్షలకు, 2006లో చిరిగింత తిరుపతి రెడ్డి రూ. 3 లక్షలకు, 2007లో జి.రఘునాధాచారి రూ. 4.15 లక్షలకు, 2007లో కోలన్ మోహన్ రెడ్డి రూ. 5.07 లక్షలకు, 2009లో సరిత రూ. 5.10 లక్షలకు లడ్డూను సొంతం చేసుకున్నారు.

అప్పటివరకూ లడ్డూ వేలం పాటలో బాలాపూర్ గ్రామవాసులే పాల్గొంటూ వస్తుండగా, ఈ లడ్డూకు డిమాండ్ పెరగడంతో, బయటివారిని కూడా పాట పాడేందుకు అనుమతించారు. దీంతో 2010లో కొడాలి శ్రీధర్ బాబు రూ. 5.35 లక్షలకు లడ్డూను సొంతం చేసుకోగా, 2011లో కోలన్ బ్రదర్స్ రూ. 5.45 లక్షలకు, 2012లో పన్నాల గోవర్ధన్ రెడ్డి రూ. 7.50 లక్షలకు, 2013లో తీగల కృష్ణారెడ్డి రూ. 9.26 లక్షలకు, 2014లో సింగిరెడ్డి జైహింద్ రెడ్డి రూ. 9.50 లక్షలకు, 2015లో కళ్లెం మదన్ మోహన్ రెడ్డి రూ. 10.32 లక్షలకు లడ్డూను వేలంలో దక్కించుకున్నారు.

ఆపై 2016లో స్కైలాబ్ రెడ్డి రూ. 14.65 లక్షలకు, 2017లో నాగమ్ తిరుపతి రెడ్డి రూ. 15.60 లక్షలకు లడ్డూను అందుకున్నారు. గత సంవత్సరం లడ్డూను రూ. 16.60 లక్షలకు శ్రీనివాస్ గుప్తా అనే బాలాపూర్ వ్యాపారి దక్కించుకున్నాడు. ఈ సంవత్సరం ఆర్థిక మాంద్యం ప్రభావం కనిపిస్తూ ఉండటంతో లడ్డూ ధర ఎంత వరకూ వెళుతుందన్న విషయమై ఉత్కంఠ నెలకొంది.

  • Loading...

More Telugu News