Andhra Pradesh: అనంతపురం జిల్లాలో సందడి చేసిన ఆడమ్ గిల్ క్రిస్ట్!
- కర్నూలుకు ఫెర్రర్ తో కలిసి ప్రయాణం
- మార్గమధ్యంలో ఆర్డీటీ స్టేడియం పరిశీలన
- భారత క్రికెట్ జట్టుపై ప్రశంసలు
ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ ఆడమ్ గిల్ క్రిస్ట్ ఏపీలోని అనంతపురం జిల్లాలో సందడి చేశాడు. ఓ కార్యక్రమం నిమిత్తం కర్నూలు జిల్లా తుగ్గలి మండలం పగిడిరాయికి బయలుదేరిన గిల్ క్రిస్ట్ మార్గమధ్యంలో అనంతపురంలోని ఆర్డీటీ స్టేడియాన్ని సందర్శించాడు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘ఆర్డీటీ స్టేడియం అద్భుతంగా ఉంది. భారత్ లో క్రికెట్ కు అద్భుతమైన ప్రోత్సాహం లభిస్తోంది. ఇక్కడ క్రికెట్ ను ఆరాధిస్తున్నారు. ప్రస్తుతం క్రికెట్ లో భారత జట్టు ప్రదర్శన బాగుంది. టీమిండియా మిగతా జట్లకు ప్రమాదకరంగా మారింది’ అని తెలిపాడు.
ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు ఫీల్డింగ్ విషయంలో కొంచెం తడబడుతోందని గిల్లీ అంగీకరించాడు. ఈ సందర్భంగా గిల్ క్రిస్ట్ వెంట ఆర్డీటీ ప్రోగ్రామ్ డైరెక్టర్ మాంఛో ఫెర్రర్ ఉన్నారు. కర్నూలు జిల్లాలోని గ్రామాన్ని సోలార్ విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం కోసం పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. ఈ కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు గిల్‌క్రిస్ట్ కర్నూలుకు వచ్చారు.