Telangana: తెలంగాణలో రెండు మేకలకు రూ.1,000 జరిమానా విధించిన పోలీసులు!
- కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ లో ఘటన
- హరితహారం మొక్కలను మేసిన మేకలు
- పోలీసులకు అప్పగించిన ఎన్జీవో సభ్యులు
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినా, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసినా పోలీసులు, సంబంధిత అధికారులు జరిమానాలు విధించడాన్ని మనం చూసి ఉంటాం. కానీ కొందరు పోలీసులు మాత్రం రెండు మేకలకు రూ.1,000 జరిమానా విధించారు. ఈ ఘటన తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని హుజూరాబాద్ లో ‘సేవ్ ది ట్రీస్’ ఎన్జీవో సంస్థ 980 మొక్కలను నాటింది. అయితే కొన్ని మేకలు వీటిలో 250కిపైగా మొక్కలను తినేశాయి.
అలాగే తెలంగాణ ప్రభుత్వం ‘హరిత హారం’ పథకం కింద నాటిన మొక్కలను కూడా ఈ మేకలు తినేశాయి. ఈ నేపథ్యంలో మొక్కలను తినేస్తున్న రెండు మేకలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఎన్జీవో సభ్యులు పోలీస్ అధికారులకు అప్పగించారు. దీంతో తన మేకలు కనిపించకపోవడంతో వాటి యజమాని రాజయ్య స్టేషన్ కు రాగా, పోలీసులు రూ.వెయ్యి జరిమానా విధించారు. మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో ఆ మొత్తం జరిమానా కట్టిన సదరు యజమాని, తన మేకలను తోలుకుపోయాడు.