Andhra Pradesh: ప్రధాని మోదీకి ‘కౌ ఎకానమీ’పై ఉన్న శ్రద్ధ భారత ఆర్థిక వ్యవస్థపై లేదు!: మజ్లిస్ అధినేత ఒవైసీ సెటైర్లు
- మోదీ ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారు
- పేదరికం, నిరుద్యోగం గురించి మాట్లాడటం లేదు
- త్వరలోనే 10 లక్షల ఉద్యోగాలు ఊడబోతున్నాయి
ఓం, ఆవు అనే పదాలను వినగానే దేశంలో కొందరు గగ్గోలు పెడుతున్నారనీ, కరెంట్ షాక్ తగిలినట్లు వణికిపోతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ నిన్న విమర్శించిన సంగతి తెలిసిందే. పశుపోషణ లేకుండా ఏ దేశపు ఆర్థిక వ్యవస్థ కూడా మనుగడ సాగించలేదని మోదీ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రధాని వ్యాఖ్యలపై మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. దేశంలోని పేదరికం, ఆర్థిక సంక్షోభం, నిరుద్యోగం వంటి అంశాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని ఒవైసీ విమర్శించారు.
అందుకే ఆవు, ఓం వంటి విషయాలను ప్రస్తావిస్తున్నారని దుయ్యబట్టారు. దేశ ఆర్థిక వృద్ధిరేటు పడిపోవడం, యువత నిరుద్యోగులు కావడంపై ప్రధాని మాట్లాడాలనుకోవడం లేదని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ ఓ మతం గురించే మాట్లాడటం నిజంగా దురదృష్టకరమని ఆయన అభిప్రాయపడ్డారు. అన్నిమతాల వారు కలసికట్టుగా జీవించే భారత్ అందం, విశిష్టత గురించి ప్రధాని మాట్లాడరని విమర్శించారు. ఆయన రాజ్యాంగం సాక్షిగా ప్రమాణం చేశారనీ, త్వరలోనే అన్ని మతాల పట్ల సానుకూలంగా మోదీ మాట్లాడాలని ఆశిస్తున్నట్లు ఒవైసీ పేర్కొన్నారు.
ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి దేశంలో ఎన్ని మూకహత్యలు జరిగాయో మోదీ సమాధానం చెప్పాలని ఒవైసీ డిమాండ్ చేశారు. హిందూ సోదరులు ఆవును పవిత్రంగా భావిస్తారనీ, మతవిశ్వాసాలను ఎవరైనా గౌరవించాల్సిందేనని స్పష్టం చేశారు. మోదీకి ఆవుల ఆర్థిక వ్యవస్థ(కౌ ఎకానమీ)పై ఉన్న ప్రేమ భారత ఆర్థిక వ్యవస్థ(ఇండియన్ ఎకానమీ)పై లేదని ఎద్దేవా చేశారు. దేశంలో 10 లక్షల మంది ఉద్యోగాలు ఊడబోతున్నాయనీ, అదే సమయంలో మోదీ కౌ ఎకానమీ గురించి మాట్లాడుతున్నారని ఒవైసీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.