Andhra Pradesh: ఉండవల్లి శ్రీదేవి కుల దూషణ వ్యవహారం.. ఏపీ డీజీపీకి జాతీయ మహిళా కమిషన్ నోటీసులు!
- ఇటీవల వినాయక చవితి సందర్భంగా ఘటన
- శ్రీదేవిని దూషించిన నలుగురు టీడీపీ నేతలు
- జాతీయ మహిళా కమిషన్ ను ఆశ్రయించిన ఎమ్మెల్యే
గుంటూరు జిల్లా అనంతవరంలో వైసీపీ దళిత ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని ఇటీవల కొందరు టీడీపీ నేతలు కులం పేరుతో దూషించినట్లు కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే అనుచరుల ఫిర్యాదుతో అప్పట్లో టీడీపీ నేతలు కొమ్మినేని శివయ్య, కొమ్మినేని సాయి, కొమ్మినేని రామకృష్ణ, కొమ్మినేని బుజ్జిలపై తుళ్లూరు పోలీసులు ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద కేసు పెట్టారు. తాజాగా ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి జాతీయ మహిళా కమిషన్ ను ఆశ్రయించారు.
అనంతవరంలో వినాయక మండపానికి వెళ్లిన తనపై కొందరు కుల, లింగ వివక్ష వ్యాఖ్యలు చేశారని శ్రీదేవి మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న జాతీయ మహిళా కమిషన్.. ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు నోటీసులు జారీచేసింది. ఈ విషయమై పూర్తి స్థాయిలో తమకు నివేదికను అందించాలని సవాంగ్ కు జాతీయ మహిళా కమిషన్ ఆదేశించింది.