Kapil Sibal: ట్రైలర్ చాలు.. మొత్తం సినిమా చూడలేం: మోదీకి కపిల్ సిబాల్ కౌంటర్
- బీజేపీ 100 రోజుల పాలనపై సిబాల్ విమర్శలు
- దేశం ఎన్నో సమస్యలతో బాధ పడుతోంది
- నిరుద్యోగం మాత్రమే పెరిగింది
రెండో సారి అధికారాన్ని చేపట్టిన బీజేపీ 100 రోజుల పాలనను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ప్రధాన మోదీ మాట్లాడుతూ, మరింత బలమైన, పని చేసే ప్రభుత్వాన్ని అందిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చామని... గత ఐదేళ్ల కంటే ఇప్పుడు మరింత వేగంగా ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు. ప్రజలందరి ఆకాంక్షలను నెరవేర్చుతామని తెలిపారు. ఈ 100 రోజుల్లో ఎంతో సాధించామని... ఇది కేవలం ట్రైలర్ మాత్రమేనని... అసలైన సినిమా ముందుందని చెప్పారు.
మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కపిల్ సిబాల్ ఘాటుగా స్పందించారు. దేశ ఆర్థిక వ్యవస్థ పతనమవుతోందని, ఆటోమొబైల్స్ అమ్మకాలు పడిపోయాయని, ఉద్యోగాలపై ఆందోళన నెలకొందని, ఎన్నో సమస్యలతో దేశం ఇబ్బంది పడుతోందని... ఈ నేపథ్యంలో మోదీ అబద్ధాలతో ఉండే సినిమాను తాను చూడదలుచుకోలేదని అన్నారు.
ఈ 100 రోజుల ట్రైలర్ లో జీడీపీ 5 శాతానికి పతనమైందని, వినియోగం, ఆటోమొబైల్స్ అమ్మకాలు, జీఎస్టీ కలెక్షన్, పెట్టుబడులు తగ్గిపోయాయని సిబాల్ విమర్శించారు. నిరుద్యోగం మాత్రం 8.2 శాతం పెరిగిందని చెప్పారు. ఈ ట్రైలర్ చాలని... మొత్తం సినిమాను తాము చూడలేమని ఎద్దేవా చేశారు.