Botsa Satyanarayana: మున్సిపల్ కమిషనర్ల సమావేశంలో బొత్స కీలక వ్యాఖ్యలు
- అమరావతిలో మున్సిపల్ కమిషనర్ల వర్క్ షాప్
- శివరామకృష్ణన్ కమిటీ నివేదికను గత ప్రభుత్వం పట్టించుకోలేదని వ్యాఖ్యలు
- ఇప్పుడు తమ సర్కారు అదే తరహాలో మరో కమిటీ ఏర్పాటు చేసిందని వెల్లడి
కొన్నాళ్లుగా రాజధాని అమరావతి అంశం విపరీతంగా చర్చకు వస్తోందంటే అందుకు కారణం ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలే. ఆ తర్వాత కూడా బొత్స అడపాదడపా రాజధానిపై వ్యాఖ్యలు చేస్తూ వ్యవహారం మరుగున పడకుండా చేస్తున్నారు. తాజాగా ఆయన మరోసారి ఈ అంశంపై స్పందించారు. అమరావతిలో ఇవాళ మున్సిపల్ కమిషనర్ల వర్క్ షాప్ లో బొత్స కీలక వ్యాఖ్యలు చేశారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదికను గత ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. కమిటీ నివేదికను గత ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.
శివరామకృష్ణన్ కమిటీ రాజధాని గురించే కాకుండా సమగ్రాభివృద్ధిపైన కూడా నివేదిక ఇచ్చిందని తెలిపారు. గత ప్రభుత్వం ప్రీ ఆక్యుపైడ్ మైండ్ తో ఉంది కాబట్టే ఆ కమిటీ నివేదికను నిర్లక్ష్యం చేసిందని బొత్స ఆరోపించారు. ఇప్పుడు తమ సర్కారు శివరామకృష్ణన్ కమిటీ తరహాలోనే మరో కమిటీ ఏర్పాటు చేసిందని, 13 జిల్లాలు అభివృద్ధి చెందాలన్న దృక్పథంతోనే ఈ ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు.