Andhra Pradesh: యరపతినేని, బోండా, కోడెల పునరావాస కేంద్రాలను చంద్రబాబు ఎందుకు పెట్టలేదు?: వైసీపీ నేత రోజా
- జగన్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారు
- దాన్ని చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు
- పెయిడ్ ఆర్టిస్టులతో డ్రామాలు చేస్తున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పాలనలో రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉంటే చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని వైసీపీ నేత, ఏపీఐఐసీ చైర్మన్ రోజా విమర్శించారు. అందుకే పెయిడ్ ఆర్టిస్టులతో డ్రామాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. కోడెల శివప్రసాద్, యరపతినేని శ్రీనివాసరావు వంటి కీచకుల నుంచి విముక్తి పొందినందుకు పల్నాడు ప్రజలు ఆనందంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. తిరుమలలో ఈరోజు శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రోజా మీడియాతో మాట్లాడారు. జగన్ సీఎం అయ్యాక రాష్ట్రమంతా ప్రశాంతంగా, సుభిక్షంగా ఉందని రోజా తెలిపారు.
నదులన్నీ పొంగి ప్రవహిస్తూ జలకళను సంతరించుకున్నాయని చెప్పారు. అధికారంలోకి వచ్చి 100 రోజులు మాత్రమే అయినా అనేక సంక్షేమ కార్యక్రమాలతో జగన్ ముందుకు వెళుతున్నారని కితాబిచ్చారు. అమ్మఒడి, ఫీజు రీయింబర్స్ మెంట్, ఆటో డ్రైవర్లు, నాయీ బ్రాహ్మణులకు మద్దతుగా జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారని పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి తరహాలో రైతుబాంధవుడిగా నిలిచేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని రోజా తెలిపారు. ఏపీ ప్రజలంతా ప్రశాంతంగా ఉంటే కృష్ణా జిల్లాలో వరదలంటూ పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి ప్రభుత్వంపై దుమ్మెత్తిపోసేందుకు ప్రయత్నించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పునరావాస కేంద్రాలను టీడీపీ అవసరం లేకుండా పెడుతున్నారని విమర్శించారు. ‘యరపతినేని, కోడెల, బోండా ఉమ, దేవినేని ఉమ, అచ్చెన్నాయుడు అరాచకాలకు ఎంతోమంది బలైతే చంద్రబాబు పునరావాస కేంద్రాలు ఎందుకు పెట్టలేదు? నారాయణ కాలేజీలో ఎంతోమంది అమ్మాయిలు చనిపోతే, పునరావాస కేంద్రాలను చంద్రబాబు ఎందుకు పెట్టలేదు? తప్పులు చేసి ఐదేళ్ల పాటు ప్రజలను మోసం చేసి చివర్లో పసుపు-కుంకుమ పేరుతో మోసం చేయాలని చంద్రబాబు అనుకున్నారు. కానీ ప్రజలు ఆయనకు బుద్ధి చెప్పారు. ఇలాంటి దుర్మార్గుడు వద్దనుకున్నారు. జగన్ మొదటి రోజు నుంచి కూడా ప్రజా సంక్షేమం కోసమే పనిచేస్తున్నారు. ఇప్పటికైనా టీడీపీ పెయిడ్ ఆర్టిస్టులతో డ్రామాలను ఆపాలి’ అని రోజా హితవు పలికారు. ఒకవేళ ఇలాంటివి ఆపకుంటే ఈసారి వచ్చిన 23 సీట్లు కూడా తెలుగుదేశానికి మిగలవని స్పష్టం చేశారు.