Jagan: వైసీపీ కాపు నేతలు జగన్ కు భయపడుతున్నారని ఓ పెద్దాయన చెప్పారు: పవన్ కల్యాణ్
- రాజోలుకు వెళ్లినప్పుడు ఓ పెద్దాయన నన్ను కలిశారు
- ఆ సందర్భంగా కాపు రిజర్వేషన్లపై చర్చ వచ్చింది
- జగన్ పై భయంతోనే కాపు నేతలు మాట్లాడటం లేదని మనం అనుకోవాలి
వైసీపీ 100 రోజుల పాలనపై నివేదికను విడుదల చేసిన సందర్భంగా కాపు రిజర్వేషన్లపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఆయన ఆసక్తికర సమాధానాన్ని ఇచ్చారు. కాపు రిజర్వేషన్ల అంశాన్ని తాము ముందుకు తీసుకెళతామని వైసీపీలో ఉన్న కాపు నేతలు గతంలో అన్నారని చెప్పారు. ఈ మధ్య కాలంలో తాను రాజోలుకు వెళ్లినప్పుడు ఓ పెద్దాయన తనను కలిశారని... ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గొడ్డలిలో దూరిన కర్ర... కులాన్నంతా కొట్టేస్తుందని అన్నారని తెలిపారు. అదే మాదిరి వైసీపీలో దూరిన కాపు నాయకులందరూ వ్యవహరిస్తున్నారని చెప్పారు.
కాపు రిజర్వేషన్లను ఇవ్వబోమని, వారికి ఈబీసీ రిజర్వేషన్లలో కూడా కోటా కల్పించబోమంటూ జగన్ ఛీ కొట్టినా వారంతా ఆ పార్టీలోనే ఉన్నారంటే... వారి గురించి ఏమనుకోవాలో తనకు తెలియడం లేదని పవన్ అన్నారు. కాపుల ఓట్లతో చాలా మంది వైసీపీ కాపు నేతలు గెలిచారని... ఇప్పుడు రిజర్వేషన్ల గురించి వారు మాట్లాడటం లేదని వ్యాఖ్యానించారు. ఇదే విషయంపై తనను కలిసిన పెద్దాయనను ప్రశ్నించానని... టీడీపీ మీద ఈ కాపు నేతలంతా ఎగిరెగిరి పడేవారు కదా... వైసీపీ అధినేతను వారు ఎందుకు ప్రశ్నించడం లేదని అడిగానని చెప్పారు. జగన్ అంటే వైసీపీ కాపు నేతలకు భయమేమో అని ఆయన సమాధానమిచ్చారని తెలిపారు. ఆ భయంతోనే వారు మాట్లాడటం లేదని మనం అనుకోవాలని చెప్పారు.