Hindi: అమిత్ షా 'హిందీ' వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసిన పుదుచ్చేరి సీఎం
- దేశంలో హిందీ తప్పనిసరిగా నేర్చుకోవాలన్న అమిత్ షా
- అభ్యంతరం వ్యక్తం చేస్తున్న దక్షిణాది రాష్ట్రాలు
- దక్షిణాదికి ప్రత్యేక భాషా అస్తిత్వం ఉందన్న పుదుచ్చేరి సీఎం
కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. హిందీ భాష తప్పనిసరి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు ఓ పట్టాన అంగీకరించలేకపోతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల నేతలు అమిత్ షా వ్యాఖ్యలకు దీటుగా బదులిచ్చారు. ఈ క్రమంలో పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి కూడా హోం మంత్రి వ్యాఖ్యల పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. హిందీ తప్పనిసరిగా నేర్చుకోవాలన్న ప్రతిపాదన పట్ల అమిత్ షా పునరాలోచన చేస్తారని భావిస్తున్నట్టు తెలిపారు. ఉత్తరాదికి, దక్షిణాదికి అస్తిత్వం పరంగా ఎంతో తేడా ఉందని, ప్రతి రాష్ట్రానికి ప్రత్యేక భాషా అస్తిత్వం ఉందని స్పష్టం చేశారు. హిందీని బలవంతంగా రుద్దడం అనేది తమిళులకు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని నారాయణస్వామి తేల్చి చెప్పారు.