Andhra Pradesh: ఏపీలో వార్తా చానళ్లను బ్యాన్ చేయడంపై పవన్ కల్యాణ్ స్పందన
- చానళ్ల నిషేధం ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యకాదన్న పవన్
- నచ్చకపోతే ప్రజలే చూడరంటూ వ్యాఖ్యలు
- చానళ్ల నిషేధానికి తాను వ్యతిరేకం అంటూ వెల్లడి
ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే మీడియా గొంతుకలను నొక్కడం మంచి పద్ధతి కాదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ హితవు పలికారు. రాష్ట్రంలో మీడియా చానళ్లపై నిషేధం ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్య కాదని ఆయన అభిప్రాయపడ్డారు. తమకు ఇష్టంలేని చానళ్లను ప్రజలే చూడరని, ఏ చానల్ చూడాలో వాళ్లే నిర్ణయించుకుంటారు తప్ప ఇందులో ప్రభుత్వం జోక్యం చేసుకోరాదని అన్నారు. ఈ విధానానికి తాను వ్యతిరేకం అని స్పష్టం చేశారు. సర్కారు తీరుపై కనీసం ఆరు నెలలపాటు స్పందించాల్సిన అవసరం రాదని భావించానని, కానీ ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే స్పందించక తప్పడం లేదని అన్నారు. రాష్ట్రంలో జన విరుద్ధమైన పాలన నడుస్తోందని విమర్శించారు.