KCR: అసెంబ్లీలో భట్టి వర్సెస్ కేసీఆర్.. మాటల తూటాలతో సభలో సెగలు
- సభలో వాగ్వివాదం
- తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కేసీఆర్ విస్మరించారన్న భట్టి
- కళ్లున్న కబోదిలా మాట్లాడుతున్నారంటూ భట్టిపై కేసీఆర్ ఫైర్
తెలంగాణ శాసనసభలో నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్, కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. ఇరువురు నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. దీంతో సభ ఒక్కసారిగా వేడెక్కింది. బడ్జెట్‌పై శనివారం జరిగిన చర్చ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రాధాన్యాలను విస్మరించి అప్పులు చేశారని ఆరోపించారు. ఏ లక్ష్యం కోసం తెలంగాణను తెచ్చుకున్నామో అది నెరవేరలేదన్నారు.
ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లు, కేజీ టూ పీజీ, దళిత, గిరిజనులకు మూడెకరాల భూమి హామీలను నెరవేర్చలేదన్నారు. బడ్జెట్లోనూ వీటికి మొండిచేయి చూపారని విమర్శించారు. తెలంగాణ కోసం ప్రజలు పోరాడింది ఇందుకేనా? అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని ఈ అయిదేళ్లలోనే దివాలా తీయించారని భట్టి ఆరోపించారు.
దీంతో సీఎం కేసీఆర్, ఇతర మంత్రులు కల్పించుకోడంతో సభ ఒక్కసారిగా వేడెక్కింది. భట్టి కళ్లున్న కబోదిలా సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని, అసెంబ్లీ ఎవరి జాగీరూ కాదని భట్టిపై కేసీఆర్ విరుచుకుపడ్డారు. ఇక్కడ తమకూ హక్కులు ఉంటాయన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సూచించారు. ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టినా ఇంకా అలానే మాట్లాడుతున్నారని, మీకు బుద్ధి జ్ఞానం రావాలని తీవ్ర స్వరంతో అన్నారు. సభను తప్పుదోవ పట్టించే మాటలు వద్దని, రాష్ట్రాన్ని దివాలా తీయించలేదని, చాలా రాష్ట్రాల కంటే మిన్నగా నిలిపామన్నారు.
కేసీఆర్ వ్యాఖ్యలకు భట్టి కూడా అంతే స్థాయిలో స్పందించారు. తాము కూడా కేసీఆర్‌కు మించిన భాష మాట్లాడగలమని, కానీ తాను అలాంటివి వాడనని, సభను గౌరవిస్తానని అన్నారు. సభలో తనకూ హక్కు ఉందన్న విషయాన్ని కేసీఆర్ గుర్తుపెట్టుకోవాలన్నారు. చేసిన అప్పులు వాస్తవమో, కాదో సమాధానం చెప్పాలని భట్టి డిమాండ్ చేశారు.