East Godavari District: కన్నబిడ్డ ప్రాణాలు బలిగొన్న తల్లిదండ్రుల ఆలస్యం!
- తూర్పు గోదావరి జిల్లాలో ఘటన
- అంబులెన్స్ లోకి పాపను ఎక్కించిన తరువాత డబ్బుకోసం వెళ్లిన తల్లి
- రావడం ఆలస్యమయ్యేవరకు దక్కని ప్రాణాలు
డెంగీ సోకిన తమ బిడ్డకు వైద్యం చేయించేందుకు డబ్బును తీసుకు రావడంలో ఆ తల్లిదండ్రులు చేసిన ఆలస్యం, బిడ్డ ప్రాణాలను బలిగొన్న హృదయ విదారక ఘటన తూర్పు గోదావరి జిల్లా తునిలో జరిగింది. ఊపిరి తీసుకునేందుకు కష్టపడుతున్న పాపకు, ఆక్సిజన్ పెట్టి, కాకినాడ జీజీహెచ్ కి తరలించే క్రమంలో, సొమ్ములు తెచ్చుకునేందుకు ఇంటికి వెళ్లిన పాప తల్లి ఆలస్యంగా రావడంతో, పాప ప్రాణాలు పోయాయి.
వివరాల్లోకి వెళితే, ఇక్కడి నివాసి నాగేశ్వరరావు, జ్యోతి దంపతులకు స్వాతిశ్రీ (5) అనే కుమార్తె ఉండగా, ఆమెకు రెండు వారాల క్రితం జ్వరం వచ్చింది. స్థానిక ఆర్ఎంపీ వైద్యుడి వద్దకు తీసుకెళ్లగా, టైఫాయిడ్, మలేరియా మందులు ఇచ్చాడు. వాటిని వాడినా ఫలితం దక్కకపోవడంతో, ఓ ప్రైవేటు ఆసుపత్రికి పాపను తీసుకెళ్లారు. పాపకు డెంగ్యూ వచ్చిందని, వెంటనే కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలని అక్కడి వైద్యులు సూచించారు.
దీంతో అంబులెన్స్ లోకి పాపను ఎక్కించి తరువాత, జ్యోతి డబ్బుల కోసం ఇంటికి వెళ్లి, ఆలస్యంగా వచ్చింది. ఈలోగానే పాప చనిపోవడంతో ఆ తల్లిదండ్రులు బోరున విలపించారు. ముందే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లుంటే ప్రాణాలు దక్కేవని వాపోయారు. నగరంలో పారిశుద్ధ్యం విషయంలో పురపాలక అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని , అందువల్లే డెంగ్యూ వంటి వ్యాధులు ప్రబలుతున్నాయని ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.