Andhra Pradesh: ప్రకాశం జిల్లా చిన్నారి ‘వెలివేత’పై సీఎం జగన్ కు అసలు లేఖే రాయలేదట!
- విచారణకు ఆదేశించిన ఏపీ ముఖ్యమంత్రి జగన్
- ఊరి పొలాన్ని తన పేరుపై రాయించుకున్న పుష్ప తాత
- ఈ చర్యకు నిరసనగా కుటుంబాన్ని బహిష్కరించిన గ్రామస్తులు
ప్రకాశం జిల్లా రామచంద్రాపురం గ్రామానికి చెందిన పుష్ప అనే అమ్మాయి ఏపీ సీఎం జగన్ కు లేఖ రాసినట్లు మీడియాలో ఇటీవల కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. తమను గ్రామస్తులంతా వెలివేశారనీ, ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని లేఖలో పుష్ప కోరింది. దీంతో ఈ విషయంలో పూర్తి వివరాలు పంపాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రకాశం కలెక్టర్ భాస్కర్ ను ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన కలెక్టర్ కు ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. పుష్ప తాతయ్య వెంకటేశ్వర్లు రామచంద్రాపురంలో 3.5 ఎకరాల పంచాయతీ భూమిని తన పేరుపై రిజిస్టర్ చేయించుకున్నాడని అధికారులు గుర్తించారు.
దీంతో గ్రామపెద్దలు వెంకటేశ్వర్లు కుటుంబాన్ని ఊరి నుంచి వెలివేశారు. దీంతో ఈ వ్యవహారంపై వెంకటేశ్వర్లు జిల్లా కలెక్టర్ కు జూలై 22న ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు విచారణ జరిపారు. గ్రామస్తులంతా కలిసికట్టుగా ఉండాలని అధికారులు సూచించినా, వాళ్లు వెనక్కి తగ్గలేదు. అయితే ఈ సమస్యను ఫిర్యాదు అందిన రెండ్రోజుల్లోనే పరిష్కరించామని స్థానిక అధికారులు జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.
అయితే తాజాగా రామచంద్రాపురంలో పరిస్థితి బాగానే ఉందని జిల్లా అధికారులు తెలిపారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లెటర్ ను అసలు విద్యార్థిని పుష్ప రాయలేదని స్పష్టం చేశారు. పుష్పతో పాటు విద్యార్థులంతా స్కూలుకు వస్తున్నారని చెప్పారు. ఎవరో ఆకతాయిలు కావాలనే ఈ లేఖను సృష్టించి ఉంటారని వ్యాఖ్యానించారు.