Avanthi Srinivas: గోదావరిలో బోటు మునక ఘటనపై స్పందించిన మంత్రి అవంతి శ్రీనివాస్
- ఆ బోటుకు పర్యాటక శాఖ అనుమతిలేదని స్పష్టీకరణ
- కాకినాడ పోర్టు అధికారుల అనుమతితో బోటు తిప్పుతున్నారన్న మంత్రి
- సహాయ చర్యల కోసం రెండు లాంచీలు పంపిస్తున్నట్టు వెల్లడి
గోదావరి నదిలో ఓ టూరిజం బోటు మునిగిపోయిన ఘటనలో భారీ సంఖ్యలో పర్యాటకులు గల్లంతైనట్టు భావిస్తున్నారు. వరద ఉద్ధృతి ఇంకా తగ్గకపోయినా గోదావరి నదిలో ఓ పర్యాటక బోటుకు అనుమతి ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ స్పందించారు.
గోదావరి నదిలో లాంచీ తిరిగేందుకు పర్యాటక శాఖ ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని వెల్లడించారు. కాకినాడ పోర్టు అధికారుల అనుమతితో ఆ లాంచీ తిప్పుతున్నారని మంత్రి తెలిపారు. సహాయక చర్యల కోసం రెండు లాంచీలు పంపిస్తున్నామని పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద గోదావరిలో ఓ పర్యాటక లాంచీ మునిగిపోవడం తెలిసిందే. నది మధ్యలో ఉన్న పెద్ద బండరాయి కారణంగా బోటు అదుపుతప్పి మునిగిపోయినట్టు సమాచారం.