East Godavari: బోటు ప్రమాద ఘటనపై విచారణ జరిపించాలి: టీ-బీజేపీ నేత లక్ష్మణ్ డిమాండ్
- బోటు ప్రమాద వార్త దిగ్భ్రాంతికి గురిచేసింది
- అనుమతిలేని బోట్లు నడుపుతుంటే ప్రభుత్వం పట్టించుకోదే!
- ప్రభుత్వం ప్రేక్షకపాత్ర వహించడం దురదృష్టకరం
ఏపీలో బోటు బోల్తా ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదం నింపింది. ఈ ఘటనపై టీ-బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ స్పందిస్తూ, బోటు ప్రమాదం వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు. అనుమతిలేని బోట్లు నడుపుతున్నా ప్రభుత్వం ప్రేక్షకపాత్ర వహించడం దురదృష్టకరమని విమర్శించారు. ఈ ప్రమాద ఘటనపై పూర్తి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
విమోచన దినోత్సవం నిర్వహిస్తే ఏమైనా ముప్పా?
హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లక్ష్మణ్ మాట్లాడుతూ, తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించేందుకు వచ్చే ఇబ్బందులేంటో సీఎం కేసీఆర్ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. విమోచనా దినోత్సవం నిర్వహిస్తే ప్రభుత్వాని ఏమైనా ముప్పు వాటిల్లుతుందా? అని ప్రశ్నించారు.
విమోచనా దినోత్సవాన్ని తెలంగాణ ప్రభుత్వం నిర్వహించకపోయినా బీజేపీ నిర్వహించి తీరుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ముఖ్యఅతిథిగా హాజరవుతారని చెప్పారు. పటాన్ చెరువులోని ఎస్వీఆర్ కన్వెన్షన్ సెంటర్ లో ఈ సభ ఏర్పాటు చేస్తామని వివరించారు.