Godavar river: బోటు ప్రమాదం: శవాసనం వేసి ప్రాణాలు దక్కించుకున్న హైదరాబాద్ వాసి
- భార్య, బావమరిది భార్య, పిల్లలతో విహారయాత్రకు వెళ్లిన జానకి రామారావు
- డేంజర్ జోన్ అంటూ ముందే హెచ్చరించారన్న రామారావు
- ఆపై కాసేపటికే బోటు ఓ పక్కకు ఒరిగిందన్న బాధితుడు
గోదావరి నదిలో జరిగిన బోటు ప్రమాదం నుంచి హైదరాబాద్కు చెందిన సీహెచ్ జానకి రామారావు శవాసనం వేసి ప్రాణాలతో బయటపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ప్రమాదం జరిగిన తీరును వివరించారు. తామందరం అల్పాహారం చేసి బోటులో కూర్చున్నామని, కాసేపటికి పాపికొండలు వస్తాయని బోటు సిబ్బంది చెప్పారన్నారు. ఇది డేంజర్ జోన్ అని, బోటు ఇటు, అటు కదిలినా భయపడాల్సిన అవసరం లేదని వారు తమతో చెప్పారని ఆయన పేర్కొన్నారు.
ఆ తర్వాత కాసేపటికే బోటు ఒక్కసారిగా పక్కకు ఒరిగిందన్నారు. ప్లాస్టిక్ కుర్చీల్లో కూర్చున్నవారంతా ఒక పక్కకు వచ్చేసారని, బరువంతా ఒకవైపునే ఉండడంతో బోటు మళ్లీ యథాస్థితికి రాలేకపోయిందని అన్నారు. మరోవైపు, కింది అంతస్తులో ఉన్నవారంతా ఒకేసారి పై అంతస్తులోకి వచ్చేందుకు ప్రయత్నించారన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే తాను శవాసనం వేసి ప్రాణాలతో బయటపడినట్టు జానకి రామారావు వివరించారు.
హైదరాబాద్ శివారులోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనివాస కాలనీకి చెందిన జానకి రామారావు రిటైర్డ్ రైల్వే ఉద్యోగి. భార్య జ్యోతికతో కలిసి ఆయన విహార యాత్రకు వచ్చారు. ప్రమాదంలో భార్య, బావమరిది భార్య, వారి కుమారుడు గల్లంతయ్యారు. ఆయన మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు.