AP tourisiom: అప్పుడు బోటు ప్రమాదానికి బాధ్యుడైన అధికారికి మళ్లీ పోస్టింగ్!
- 2017 నవంబరు 12న పవిత్ర సంగమం వద్ద ప్రమాదం
- అప్పట్లో సస్పెండ్ అయిన వారిలో జీఎం రామకృష్ణ ఒకరు
- ప్రభుత్వం మారగానే రాజమార్గంలో విధుల్లోకి
‘వడ్డించే వాడు మనవాడైతే...’ అన్నచందంగా అధికారం అండ ఉంటే ఎవరికైనా ఏం తక్కువవుతుంది. ఇందుకు పర్యాటక శాఖ జనరల్ మేనేజర్ రామకృష్ణ ఉదంతమే ఉదాహరణ. దాదాపు రెండేళ్ల క్రితం అంటే 2017 నవంబరు 12న కృష్ణా నది పవిత్ర సంగమం వద్ద జరిగిన బోటు ప్రమాదం గుర్తుందిగా. అప్పటి ఆ ప్రమాదంలో 21 మంది చనిపోయారు. పర్యాటక శాఖ ఉద్యోగులు బినామీలతో ఆ బోటును నడిపించి ప్రమాదానికి కారణమయ్యారని తేలడంతో అప్పటి ప్రభుత్వం బాధ్యులుగా భావించి 8 మందిపై వేటు వేసింది. వీరిలో అప్పుడు కూడా జీఎం అయిన రామకృష్ణ ఒకరు.
ప్రమాదం జరిగిన కొన్నాళ్ల తర్వాత తిరిగి విధుల్లోకి చేరేందుకు అప్పటి పర్యాటక శాఖ ఎండీపై ఎంత ఒత్తిడి తెచ్చినా ఆయనను విధుల్లోకి తీసుకోలేదు. ఈలోగా రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో నేతల అండదండలతో మళ్లీ జీఎం పోస్టులోకి వచ్చేశారు. ఆశ్చర్యం ఏమిటంటే అప్పట్లో ప్రభుత్వం వేటు వేసిన 8 మందిలో ఈయన ఒక్కరికే పోస్టింగ్ ఇచ్చి మిగిలిన ఎవరినీ విధుల్లోకి తీసుకోలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పర్యాటక శాఖ బస్సులు కూడా ఈయన ఆధ్వర్యంలోనే నడస్తుండడం గమనార్హం.