Chitturu Nagayya: చిత్తూరు నాగయ్య జీవితంలో జరిగిన అనూహ్య సంఘటన
- చిత్తూరు నాగయ్య గొప్ప నటుడు
- 'భక్త పోతన' .. 'యోగి వేమన' చెప్పుకోదగిన చిత్రాలు
- బాలయోగిగా మారిన అభిమాని
చిత్తూరు నాగయ్య గారు తెలుగు తెరపై నటుడిగా తనదైన ముద్రవేశారు. గాయకుడిగాను ఆయన తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఇక దర్శక నిర్మాతగాను ఆయన తన ఉత్తమాభిరుచిని చాటుకున్నారు. అలాంటి చిత్తూరు నాగయ్య గారిని గురించి సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ బీకే ఈశ్వర్ ప్రస్తావించారు.
"చిత్తూరు నాగయ్య గారు తన జీవిత కథలో అనేక ఆసక్తికరమైన విషయాలను గురించి చెప్పారు. నాగయ్య గారు నటించిన 'భక్తపోతన' .. 'యోగి వేమన' అనే సినిమాలను చూసిన ఓ కుర్రాడు 'బాలయోగి'గా మారడం వాటిలో ఒకటి. ఈ విషయం నాగయ్యగారి వరకూ వెళ్లడంతో, తన సినిమాల ప్రభావం అంతగా ఉందా అని ఆయన ఆశ్చర్యపోయారట.
ఆ కుర్రాడిని చూడాలనే ఉద్దేశంతో ఆయన ముమ్మిడివరం వెళ్లారు. ఆయన వెళ్లే సమయానికి ఆ బాలయోగి ధ్యానంలో ఉన్నారట. నాగయ్య గారు ఆ బాలయోగి ఎదురుగా కూర్చుని,'భక్త పోతన' .. 'యోగి వేమన' సినిమాల్లోని పాటలను పాడారట. అక్కడి వాళ్లంతా 'మీ సినిమాలు చూడటం వల్లనే ఆయన అలా మారాడు' అని అంటుంటే, నాగయ్య గారు సంతోషంతో పొంగిపోయారట' అని చెప్పుకొచ్చారు.