Amit Shah: జల్లికట్టు కోసం చేసింది నిరసనే, మాతృభాష కోసమైతే అంతకుమించిన యుద్ధం చేస్తాం: అమిత్ షాకు దీటుగా బదులిచ్చిన కమలహాసన్
- అమిత్ షా 'హిందీ' వ్యాఖ్యలు
- తీవ్రంగా స్పందించిన కమల్
- దూరదృష్టిలేని నిర్ణయాలంటూ విమర్శలు
భారతదేశంలో ఏకత్వం కోసం హిందీ భాష నేర్చుకోవడం తప్పనిసరి అంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. దీనిపై సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం రాజకీయ పార్టీ అధ్యక్షుడు కమలహాసన్ తీవ్రంగా స్పందించారు. గతంలో తాము జల్లికట్టు కోసం చేసింది నిరసన ప్రదర్శన మాత్రమేనని, మాతృభాష కోసం అయితే యుద్ధం చేస్తామని హెచ్చరించారు.
"దేశప్రజలు బెంగాలీ భాషలో ఉన్న జనగణమన జాతీయగీతాన్ని ఎలాంటి భేదభావం లేకుండా పాడుకుంటారు. అన్ని ప్రాంతాలకు, అన్ని భాషలకు ఆ గీతంలో సమప్రాధాన్యం ఉంది కాబట్టే ఎవరూ వ్యతిరేకించరు. భారతదేశం గణతంత్ర దేశంగా ఏర్పడిన క్షణాల్లోనే భిన్నత్వంలో ఏకత్వం అనే హామీ రూపుదాల్చింది, ఇప్పుడు ఒక షానో, ఒక సుల్తానో, సామ్రాట్టో వచ్చి ఆ హామీని నీరుగార్చలేరు" అంటూ కమల్ వ్యాఖ్యానించారు. దూరదృష్టి లేని ఇలాంటి నిర్ణయాలతో నష్టమే తప్ప ఎలాంటి ప్రయోజనం లేదన్నారు.